ఏప్రిల్ 06, నేటి తెలుగు పత్రిక: రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం రోడ్డు ప్రమాదాల్లో మరణాలను తగ్గించేందుకు భారీ ప్రణాళిక రూపొందిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి 35 కిలోమీటర్లకు ఒక ట్రామా కేర్ సెంటర్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.ఈ కొత్త ట్రామా పాలసీ ప్రధాన లక్ష్యం “గోల్డెన్ అవర్”లోనే బాధితులకు తక్షణ చికిత్స అందించడం. ప్రమాదం జరిగిన వెంటనే స్పందించేలా నాలుగు దశల్లో చికిత్స వ్యవస్థను అమలు చేయనున్నారు. మొదటగా 108 అంబులెన్స్ సేవలు సంఘటన స్థలానికి చేరుకుని ప్రాథమిక చికిత్స అందించి సమీప ట్రామా సెంటర్‌కు తరలిస్తాయి.తీవ్ర గాయాలున్న వారికి జిల్లా ఆసుపత్రుల్లో చికిత్స అందించగా, క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నవారిని పెద్ద ప్రభుత్వ ఆసుపత్రులకు తరలిస్తారు. అత్యవసర కేసులకు హైదరాబాద్‌లోని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్‌లో ఆధునిక వైద్యం అందించనున్నారు.రాష్ట్రవ్యాప్తంగా గుర్తించిన 900కి పైగా ప్రమాద ప్రాంతాల ఆధారంగా మొత్తం 74 ట్రామా సెంటర్లను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఒక్కో సెంటర్ నిర్మాణానికి సుమారు రూ.5.3 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా.ఈ ప్రాజెక్టుకు ప్రపంచ బ్యాంకు ఆర్థిక సహాయం అందించనుండగా, హైవేలపై ఎక్కడ ప్రమాదం జరిగినా నిమిషాల్లోనే స్పందించే సమగ్ర నెట్‌వర్క్ ఏర్పాటు చేయనున్నారు. దీంతో అత్యవసర చికిత్స ఆలస్యం కాకుండా ప్రాణాలను కాపాడే అవకాశాలు పెరుగుతాయని అధికారులు భావిస్తున్నారు.
