ఘనంగా ‘రైతులోకం’ ప్రత్యేక సంచిక ఆవిష్కరణ
విజయవాడ, ఏప్రిల్ 07, నేటి తెలుగు పత్రిక: వ్యవసాయ రంగంలో పశుపోషణ కీలక పాత్ర పోషిస్తోందని, సమాజాభివృద్ధికి పాడి, పంటలే ఆధారమని పశుసంవర్ధక శాఖ రాష్ట్ర డైరెక్టర్ డాక్టర్ టి. దామోదర నాయుడు స్పష్టం చేశారు. ఏప్రిల్ 25న జరుగనున్న ‘అంతర్జాతీయ పశువైద్య దినోత్సవాన్ని’ పురస్కరించుకుని మంగళవారం విజయవాడలోని పశుసంవర్ధకశాఖ రాష్ట్ర కార్యాలయ కాన్ఫరెన్స్ హాల్‌లో ‘రైతులోకం’ పత్రిక ప్రత్యేక సంచికను ఆయన ఘనంగా ఆవిష్కరించారు.ఈ సందర్భంగా డాక్టర్ టి. దామోదర నాయుడు మాట్లాడుతూ పశుసంపద అభివృద్ధిలో పశువైద్యులు చేస్తున్న కృషి వెలకట్టలేనిదని కొనియాడారు. పశువైద్య దినోత్సవాన్ని పురస్కరించుకుని నిపుణుల వ్యాసాలు, వారి విలువైన అభిప్రాయాలతో ‘రైతులోకం’ ప్రత్యేక సంచికను తీసుకురావడం శుభపరిణామమని పత్రికా సంపాదక వర్గాన్ని అభినందించారు.
గ్రామీణ పేదలకు పశుపోషణే ప్రధాన జీవనాధారమని వ్యవసాయ అనుబంధ రంగాలపై అవగాహన కోసం ఈ పత్రికను ప్రతి ఒక్కరూ చదవాలని ఆయన సూచించారు.పశుసంవర్ధకశాఖ అదనపు సంచాలకులు డాక్టర్ రత్నకుమారి మాట్లాడుతూ ఈ కాలంలో పశుసంవర్ధకశాఖ ద్వారా చేపట్టిన పలు కార్యక్రమాలను వివరించారు. పశువైద్య సేవలను పశుపోషకులు వినియోగించుకోవాలని సూచనలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రైతుసంఘం రాష్ట్ర గౌరవ అద్యక్షులు పి. రామచంద్రయ్య మాట్లాడుతూ నేటికీ గ్రామీణ ప్రాంతాల్లో 62 శాతం ప్రజలు వ్యవసాయం పైనే ఆధారపడి జీవిస్తున్నారని ఆయన గుర్తుచేశారు. పాడి, పంట అనేవి గ్రామీణాభివృద్ధికి చుక్కాని లాంటివని పేర్కొన్నారు. పశుపోషణ రంగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకంగా నిధులు కేటాయించి ప్రోత్సహించాలని కోరారు. ఈ సందర్భంగా పశుసంపద పెరుగుదలకు కృషి చేస్తున్న పశువైద్యులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఆంధ్రప్రదేశ్ రైతుసంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.వి.వి. ప్రసాద్ ప్రత్యేక సంచిక ఆవిష్కరణ సభకు అధ్యక్షత వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ… పశుసంపద అభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తున్న పశువైద్యుల సేవలను ప్రశంసించారు. రైతులోకం ప్రత్యేక సంచికకు తమ అమూల్యమైన వ్యాసాలను, అభిప్రాయాలను పంపిన పశువైద్య నిపుణులందరికీ ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో పశువైద్య దినోత్సవం పురస్కరించుకొని రాష్ట్రవ్యాప్తంగా పలు కార్యక్రమాలు నిర్వహించబోతున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ కౌలురైతులు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.జమలయ్య మాట్లాడుతూ పశుసంపద అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా పరిశోధనలు చేపట్టి నూతన ఆవిష్కరణ చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతినిధులందరికీ స్వాగతం పలుకుతూ డాక్టర్ గోపీచంద్ మాట్లాడుతూ రైతులతో పాటు పశు వైద్యులు ఈ సంచికను చదవటం ద్వారా మరింత అవగాహన పెంచుకోవచ్చని సూచించారు.ఈ కార్యక్రమంలోసంయుక్త సంచాలకులు డాక్టర్ హనుమంతరావు,
ఉపసంచాలకులు డాక్టర్ నాగేశ్వరరావు మరియు రైతుసంఘం రాష్ట్ర నాయకులు వి. హనుమారెడ్డి,కె.వీరారెడ్డి,ముక్కామాల ఉమామహేశ్వరరావు,కొల్లి రంగారెడ్డి,బుడ్డి రమేష్.సుహాస్ మరియు పలువురు ఉన్నతాధికారులు,పశువైద్యులు, రైతు నాయకులతో పాటు రైతులు, మరియు రైతులోకం పత్రికా ప్రతినిధులు పాల్గొన్నారు.
