Breaking News

బహుగ్రంధకర్త, ఉపాధ్యాయుడు మాడభూషి కృష్ణ ప్రసాద్ కన్నుమూత!

ఏప్రిల్ 08, నేటి తెలుగు పత్రిక: పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన విశ్రాంత ఉపాధ్యాయులు, రచయిత , చిరకాల మిత్రులు మాడభూషి కృష్ణ ప్రసాద్ (72) బుధవారం తెల్లవారు ఝామున కన్నుమూశారు. గత పది రోజులుగా ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ తో ఆయన అస్వస్థతతో ఉన్నారు.బి. ఎ. లిటరేచర్, ఎమ్మే హిస్టరీ చదివిన కృష్ణప్రసాద్, తొలుత ప్రభుత్వ ప్రాధమిక పాఠశాలలో ఎస్.జి.టి. గా, తర్వాత స్కూలు అసిస్టెంట్ గా ఉన్నత పాఠశాలలో ఆంగ్ల ఉపాధ్యాయునిగా పనిచేసారు. అనంతరం పాలకొల్లు సబిత కళాశాలలో, పెనుగొండ వాసవి కన్యకా పరమేశ్వరి కళాశాలలో, తణుకు ఎస్.కే.ఎస్.డి. కళాశాలలో పార్ట్ టైమ్ అధ్యాపకునిగా సేవలు అందించారు.

మాడభూషి కృష్ణప్రసాద్ గొప్ప చదువరి. బహు గ్రంథకర్త. బాల్యం నుండి జర్నలిజంపై ఆసక్తి కలిగిన కృష్ణప్రసాద్ జర్నలిస్టు కావాలని కలలు కన్నారుఅయితే ఉపాధ్యాయుడు అయ్యారు.ఉపాధ్యాయునిగా పనిచేస్తూనే పత్రికా రంగంపై లోతైన అధ్యయనం చేశారు. జర్నలిస్టులకంటే ఎక్కువ నిశితంగా పత్రికా రంగం గురించి పరిశోధించారు.

“భారతీయ పత్రికారంగ చరిత్ర” పేరిట జర్నలిజంపై ఒక ప్రామాణికమైన గ్రంథాన్ని రచించారు. నవచేతన పబ్లిషింగ్ హౌస్ ప్రచురించిన ఈ గ్రంథాన్ని APUWJ ఆధ్వర్యంలో హైదరాబాద్ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో సీనియర్ సంపాదకుల సమక్షంలో ఆవిష్కరించడం జరిగింది. అదే గ్రంథాన్ని “హిస్టరీ ఆఫ్ ఇండియన్ జర్నలిజం” పేరుతో ఇంగ్లీష్ భాషలో ఆయన తిరగ రాశారు. ఈ పుస్తకాన్నీ పాట్నాలో IJU జాతీయ కార్యవర్గ సమావేశపు వేదికపై బీహార్ శాసన మండలి చైర్మన్, రాష్ట్ర కార్మికశాఖ మంత్రి , పలువురు ఎమ్మెల్యేల సమక్షంలో ఆవిష్కరణ చేయడం జరిగింది.

శంకర్స్ వీక్లీ ఫేం కార్టూనిస్ట్ శంకర్ జీవితచరిత్ర, మోక్షగుండం విశ్వేశ్వరయ్య జీవిత చరిత్ర, అన్నే ఫ్రాంక్ డైరీ, పిల్లల కథలు వంటి పలు గ్రంథాలు రచించారు.

విజయవాడ టెర్రర్ లింక్ కేసులో కొత్త మలుపు.. మహిళల రిక్రూట్‌మెంట్‌పై దర్యాప్తు

సి.రాఘవాచారి మీడియా అకాడమీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ప్రచురింప తలపెట్టిన మోనోగ్రాఫ్ ల ప్రాజెక్టులో నిపుణుల కమిటీలో సభ్యునిగా ఇటీవల నియమితులు అయ్యారు. ఖాసా సుబ్బారావు మోనోగ్రాప్ రాయడానికి ఆయన బాధ్యత తీసుకున్నారు.సుప్రసిద్ధ సంపాదకుల జీవిత విశేషాలను గ్రంథస్థం చేయడానికి, “సంపాదకునిగా గాంధీజీ” పేరుతో మరో పుస్తకం రాయడానికి ఆయన సంసిద్ధం అవుతున్నారు. పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు ఇంగ్లీష్ బోధించడం ఆయనకు కాలక్షేపం. పరిసరాల్లో జరిగే సాహిత్య సభలకు, కార్యక్రమాలకు హాజరవుతూ ఉంటారు. ఆయన ఎంత సీరియస్ రచయితో అంత హాస్యప్రియుడు. హాస్యం, వ్యంగ్యం మేళవించిన సంభాషణా చతురుడు. ఆయన సతీమణి కూడా ఇంగ్లీష్ టీచరుగా పనిచేస్తున్నారు. వారికి ఇద్దరు కుమారులు.

మాడభూషి కృష్ణప్రసాద్ మరణంతో తెలుగు పత్రికా రంగం ఒక పరిశోధకుడిని కోల్పోయింది. ఆయన నుండి ఇంకా ఎన్నో రచనలను ఆశిస్తున్న సమయంలో ఆయన అకాల మరణం చెందటం తెలుగు సాహిత్యానికి పూడ్చలేని నష్టం కలిగింది.వారానికి రెండు మూడు సార్లు ఫోన్లో మాట్లాడుకోవడం , జర్నలిజం ధోరణులపై, జరిగిన ఉదంతాలపై, సంపాదకీయాలపై చర్చించుకోవడం మా ఇద్దరికీ అలవాటు.ఇటీవల ఐజేయు 11 వ ప్లీనరీ విశేషాల గురించి కూడా ఆయన అడిగి తెలుసుకున్నారు.నా అభ్యర్థన మేరకు ఐ.జే.యు. 11 వ ప్లీనరీ సావనీర్ కు ఒక వ్యాసాన్ని రాసి పంపించారు.ఈ వారంలో కూడా తనకు ఆరోగ్యం బాగుండకపోయినా ఖాసా సుబ్బారావు మోనోగ్రాప్ గురించి నాతో రెండుసార్లు మాట్లాడారు. ఏవో పుస్తకాలు కావాలని అడిగారు. ఆరోగ్యం మెరుగయ్యాక మాట్లాడుకుందాం, ముందు వైద్యం చేయించుకోండి అన్నాను.ఈ రోజు ఈ విషాదకర సమాచారం వినాల్సి వచ్చింది.

మాడభూషి కృష్ణప్రసాద్ మరణంతో ఒక మంచి మిత్రుడిని కోల్పోయాను.

కృష్ణప్రసాద్ కు శ్రద్ధాంజలి.
కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి.

కష్టపడిన వారిని గుర్తించాలనేది తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం

డి.సోమసుందర్.
సెక్రటరీ జనరల్,
ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్.
08-04-2026.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *