Breaking News

యువత పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలి: రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత

మంగళగిరి ఏప్రిల్ 08 ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): యువత పారిశ్రామిక వేత్తలుగా ఎదిగి, మరింత మంది నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియ జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత పిలుపునిచ్చారు. ప్రతి ఇంటి నుంచి ఒకరిని పారిశ్రామికవేత్తగా తీర్చిదిద్దాలన్నది సీఎం చంద్రబాబు లక్ష్యమన్నారు. పరిశ్రమల స్థాపనకు ముందుకొచ్చే ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు తమ ప్రభుత్వం అన్ని విధాలా ప్రోత్సహిస్తుందని తెలిపారు. నాగార్జున యూనివర్శిటీలోని డాక్టర్ హెచ్.హెచ్.డైక్ మన్ ఆడిటోరియంలో బుధవారం నిర్వహించిన ఎంఎస్ఎంఈ పార్కుల్లో ఈడబ్ల్యూఎస్ వర్గీయులకు అవకాశాలపై ఒకరోజు అవగాహన సదస్సులో మంత్రి పాల్గొన్నారు. ముందుగా జ్యోతి ప్రజల్వన చేసి, అనంతరం మంత్రి సవిత ప్రసంగించారు. ఎంఎస్ఎంఈ పార్కుల్లో చిన్న,మధ్యతరహా పరిశ్రమలకు ఏర్పాటుపై అగ్ర కులాల్లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన ఈడబ్ల్యూఎస్ వర్గీయులకు అవగాహన సదస్సు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈడబ్ల్యూఎస్ వర్గీయులకు మేలు కలుగజేసేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. ఇంతకుముందు ప్రకృతి వ్యవసాయంతో ఎలా లాభాలు ఆర్జించ వచ్చో అవగాహన సదస్సు నిర్వహించారన్నారు. ఇప్పుడు ఉపాధి కల్పనపై మరో అవగాహన సదస్సు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈడబ్ల్యూఎస్ వర్గీయుల పేదరికాన్ని పారదోలడానికి కూటమి ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి ఇది నిదర్శనమన్నారు.

ఎంఎస్ఎంఈ పార్కుల్లో ఈడబ్ల్యూఎస్ వర్గీయులకు పెద్దపీట

దేశ పారిశ్రామిక రంగంలో ఏపీని అగ్రగామిగా నిలబెట్టడానికి సీఎ చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ రేయింబవళ్లు కృషి చేస్తున్నారని మంత్రి సవిత వెల్లడించారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా 2029 నాటికి 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన కేవలం 22 నెలల కాలంలోనే ఏపీకి రూ.25 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజక వర్గాల్లోనూ ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ పార్కుల్లో పరిశ్రమలు ఏర్పాటు చేసే పెట్టుబడి దారులకు ప్రభుత్వం అన్ని విధాలా సహాయ సహకారాలు అందజేస్తోందన్నారు. తక్షణ అనుమతులకు చర్యలు తీసుకుంటోందన్నారు. ఎంఎస్ఎంఈ పార్కుల్లో చిన్న, మధ్యతరహా పరిశ్రమల ఏర్పాటుకు ముందుకొచ్చే ఈడబ్ల్యూఎస్ సామాజిక వర్గీయులకు బీసీ సంక్షేమ శాఖ ద్వారా అండగా నిలుస్తామన్నారు. ఆసక్తి కలిగిన యువత డీపీఆర్ లతో ముందుకొస్తే, చిన్న,మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటుకు సబ్సిడీ రుణాలు, ఉత్పత్తులపై అవగాహన కల్పిస్తామని మంత్రి సవిత తెలిపారు.

విజయవాడ టెర్రర్ లింక్ కేసులో కొత్త మలుపు.. మహిళల రిక్రూట్‌మెంట్‌పై దర్యాప్తు

యువతకు సీఎం చంద్రబాబు ప్రాధాన్యం…

ప్రతి ఇంటి నుంచి ఒకరిని పారిశ్రామిక వేత్తగా తీర్చిదిద్దాలన్నది సీఎం చంద్రబాబు లక్ష్యమని మంత్రి సవిత తెలిపారు. ఇందులో భాగంగా నిర్వహిస్తున్న ఒక రోజు సదస్సును ఈడబ్ల్యూఎస్ సామాజిక వర్గానికి చెందిన యువత, ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు, విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. యువతే భారత దేశ బలమని, వారి చేతుల్లోనే దేశ భవిష్యత్తు ఉందని అన్నారు. అందుకే సీఎం చంద్రబాబు అన్నింటా యువతకు ప్రాధాన్యమిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని సద్వినియోగం చేసుకుని పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలన్నారు. ఐఏఎస్, ఐపీఎస్ ల కంటే పారిశ్రామికవేత్తలుగా తోటి నిరుద్యోగులకు ఉపాధి కల్పించే అవకాశం కలుగుతుందన్నారు. పారిశ్రామిక వేత్తలు గా మహిళలు రాణిస్తే మరింత అభివృద్ధి సాధ్యమవుతుందని మంత్రి సవిత తెలిపారు. రాష్ట్ర ఈడబ్ల్యూఎస్ శాఖ ముఖ్య ప్రధాన కార్యదర్శి కె.సునీత మాట్లాడుతూ, అగ్ర కులాల్లో పేదరికంతో బాధపడే వారిని ఆర్థికంగా అభివృద్ది చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. అంతకుముందు ఆడిటోరియంలో వివిధ సంస్థలకు చెందిన తొమ్మిది స్టాళ్లను మంత్రి సవిత పరిశీలించారు. పరిశ్రమల ఏర్పాటుకు వారు అందిస్తున్న తోడ్పాటును అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్ఎంఈ సీఈవో ఎం.విశ్వ, వీసీ గంగాధర్ రావు, పలువురు కార్పొరేషన్ చైర్మన్లు బుచ్చి రాంప్రసాద్, బ్రహ్మం చౌదరి, డైరెక్టర్లు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, విద్యార్థులు, ఈడబ్ల్యూఎస్ సామాజిక వర్గీయులు తదితరులు పాల్గొన్నారు.

కష్టపడిన వారిని గుర్తించాలనేది తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *