సూర్యాపేట, ఏప్రిల్ 20(నేటి తెలుగు పత్రిక): మార్క్ ఫెడ్ ఆధ్వర్యంలో వ్యవసాయ మార్కెట్ లలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ రైతులకు సూచించారు. సోమవారం సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ లో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మార్క్ ఫెడ్ ఆధ్వర్యంలో జిల్లాలో సూర్యాపేట, కోదాడ, తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్ లలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.. రాష్ట్ర ప్రభుత్వం క్వి0టా రూ.2400 మద్దతు ధర కల్పిస్తుందని, మార్కెట్ లలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలో పంటను అమ్మి మద్దతు ధర పొందాలన్నారు.
బయట నుండి ధాన్యం రాకుండా పటిష్ట భద్రత
ఇతర రాష్ట్రాల నుండి జిల్లాకు ధాన్యం రాకుండా బార్డర్ చెక్ పోస్ట్ లను ఏర్పాటు చేసి పటిష్ట భద్రత ఏర్పాటు చేశామన్నారు. పోలీస్, సివిల్ సప్లయ్, రెవెన్యూ శాఖలు సంయుక్తంగా పని చేస్తూ బయట నుండి ధాన్యం రాకుండా పకడ్బందీగా చర్యలు చేపట్టామన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సన్న రకం ధాన్యానికి అందిస్తున్న బోనస్ తెలంగాణ రైతులు పొందేలా బయట నుండి ధాన్యం రాకుండా ఆదేశాలు జారీ చేశామని, ధాన్యం వస్తున్నట్లు సమాచారం అందిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.జిల్లాలో 340 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని, దాదాపు 25వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని వివరించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలలో అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు.. జిల్లా, మండల స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేసి కొనుగోలు కేంద్రాలలో సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరించేలా కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు.
రైతులకు రూ.5లకే నాణ్యమైన భోజనం
సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ లో రైతుల కోసం ఏర్పాటు చేసిన రూ.5ల భోజనం ఏర్పాటు చేయడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తెలిపారు.. హరే రామ, హరే కృష్ణ ఫౌండేషన్ సౌజన్యంతో వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రూ.5 అన్నపూర్ణ భోజనాన్ని కలెక్టర్ ప్రారంభించి రైతులకు స్వయంగా వడ్డించారు.. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దూరం నుండి పంటను అమ్ముమునేందుకు వస్తున్న రైతులకు మంచి క్వాలిటీ భోజనాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అన్నం, కూర, పప్పు, పచ్చడితో రైతులకు నాణ్యత భోజనం ఏర్పాటు చేయడం జరిగిందని, సీజన్ సమయంలో భోజనం తో పాటు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో టిఫిన్ ఏర్పాటు చేయడం సంతోషకరం అన్నారు.కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి మార్క్ ఫెడ్ జిల్లా మేనేజర్ బాలకృష్ణ, డి.ఎ.ఓ. శ్రీధర్ రెడ్డి, డి.ఎం.ఓ. నాగేశ్వర శర్మ, డి.సి.ఓ. ప్రవీణ్, ఎ.ఎం.సి.డైరెక్టర్స్, రైతులు, తదితరులు పాల్గొన్నారు.

