Breaking News

మేఘాలయ పర్యటనకు మంత్రి సీతక్క.. సంక్షేమ పథకాలపై అధ్యయనం

ఏప్రిల్ 22, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క బుధవారం నుంచి మేఘాలయ రాష్ట్ర పర్యటనకు వెళ్లనున్నారు. మేఘాలయ ప్రభుత్వ ఆహ్వానం మేరకు ఈ పర్యటన జరుగుతుండగా, స్టేట్-టు-స్టేట్ భాగస్వామ్య కార్యక్రమంలో భాగంగా రెండు రోజులపాటు అక్కడి సంక్షేమ పథకాలను పరిశీలించనున్నారు.ఈ పర్యటనలో ముఖ్యంగా మహిళా, శిశు అభివృద్ధి రంగంలో మేఘాలయ అమలు చేస్తున్న వినూత్న కార్యక్రమాలను మంత్రి అధ్యయనం చేయనున్నారు. “మిషన్ 1000 డేస్”, ఎర్లీ చైల్డ్‌హుడ్ డెవలప్‌మెంట్ (ECD), అంగన్‌వాడి కేంద్రాల అభివృద్ధి వంటి అంశాలపై ప్రత్యేకంగా దృష్టి సారించనున్నారు. గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల పోషణ, ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన విధానాలను సమగ్రంగా పరిశీలించనున్నారు. అదేవిధంగా ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ (ADB) మరియు ఇతర భాగస్వామ్య సంస్థలతో జరిగే సమావేశాల్లో పాల్గొని, శిశు పోషణ, అంగన్‌వాడి సేవల మెరుగుదల, డిజిటల్ పర్యవేక్షణ వంటి అంశాలపై చర్చలు జరపనున్నారు. మంత్రి వెంట మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ శృతి ఓజా కూడా ఈ పర్యటనలో పాల్గొననున్నారు.మేఘాలయలో అంగన్‌వాడి కేంద్రాలను “హ్యాపినెస్ సెంటర్లు”గా అభివృద్ధి చేసి, పిల్లల సమగ్ర అభివృద్ధికి వేదికలుగా మార్చడం ప్రత్యేకతగా నిలిచింది. పిల్లల పోషణతో పాటు ప్రాథమిక విద్య, మానసిక వికాసం, ఆరోగ్య సేవలను ఒకే చోట అందించే విధానాన్ని అమలు చేస్తున్నారు.మహిళా సంఘాలు, వైద్య, విద్య, గ్రామీణాభివృద్ధి శాఖల సమన్వయంతో మేఘాలయలో శిశు మరణాలను తగ్గించడం, పోషకాహార లోపాన్ని నియంత్రించడం వంటి అంశాల్లో మంచి ఫలితాలు సాధించారు. ఈ విజయవంతమైన నమూనాలను తెలంగాణలో అమలు చేయాలనే లక్ష్యంతో మంత్రి ఈ పర్యటన చేపడుతున్నారు.తెలంగాణలో అంగన్‌వాడి సేవలను మరింత బలోపేతం చేయడం, మాతా-శిశు ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, పిల్లల సమగ్ర అభివృద్ధికి కొత్త విధానాలను తీసుకురావడం ఈ పర్యటన ప్రధాన ఉద్దేశ్యంగా అధికారులు పేర్కొంటున్నారు.

ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వం పిలుపు

మంచిర్యాలలో ఆర్టీసీ కార్మికుల ఆందోళన

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *