అమరావతి, ఏప్రిల్ 22, (నేటి తెలుగు పత్రిక): పిఠాపురంలో చోటుచేసుకున్న ప్రొటోకాల్ వివాదంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై స్పందించిన ఆయన, పార్టీ నేతలు ఐక్యంగా వ్యవహరించాలని స్పష్టంగా ఆదేశించారు.ఈ అంశంపై తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస రావు తో సీఎం మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. ప్రొటోకాల్ పేరుతో లేదా ఫ్లెక్సీల్లో ఫొటోలకు ప్రాధాన్యం కోసం నేతలు పరస్పరం ఘర్షణ పడటం సరైంది కాదని ఆయన వ్యాఖ్యానించారు.పిఠాపురం ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (పాడా) సమావేశం సందర్భంగా జరిగిన ఈ ఘటనలో మాజీ ఎమ్మెల్యే వర్మ వ్యవహారం సరికాదని సీఎం అభిప్రాయపడ్డారు. ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన నాయకులు ఇలాంటి చర్యలకు పాల్పడటం పార్టీ ప్రతిష్ఠకు హానికరమని ఆయన పేర్కొన్నారు.ఏదైనా సమస్యలు ఉంటే వాటిని పార్టీ పెద్దల దృష్టికి లేదా ప్రభుత్వానికి తీసుకురావాలని సీఎం సూచించారు. ప్రత్యక్షంగా గొడవలకు దిగడం సరైన విధానం కాదని, ఇలాంటి చర్యలు కేడర్‌కు తప్పుడు సందేశాలు ఇస్తాయని హెచ్చరించారు.భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ వ్యవహారంలో సంబంధిత నేతలకు తగిన సూచనలు ఇవ్వాలని పార్టీ నాయకత్వానికి సూచించారు.పార్టీలో ఐక్యత, క్రమశిక్షణ అత్యంత ముఖ్యమని, వ్యక్తిగత ప్రాధాన్యం కోసం పోటీ పడకూడదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. నాయకుల మధ్య ఘర్షణలు పార్టీ ప్రతిష్ఠను దెబ్బతీస్తాయని ఆయన హెచ్చరించారు.
పిఠాపురం ప్రొటోకాల్ వివాదం.. నేతలపై సీఎం చంద్రబాబు ఆగ్రహం
