పామర్రు, ఏప్రిల్ 23 (నేటి తెలుగు పత్రిక ): పిల్లలు ఆరోగ్యంగా ఎదగాలంటే జంక్ ఫుడ్‌కు దూరంగా ఉంచడం తల్లిదండ్రుల తప్పనిసరి బాధ్యతగా తీసుకోవాలని పామర్రు ఐసిడిఎస్ ప్రాజెక్టు సెక్టార్ సూపర్వైజర్ టి. అనిత అన్నారు. నియోజకవర్గ పరిధిలోని పమిడిముక్కల మండలం కపిలేశ్వరపురం సెక్టర్ లోని తాడంకి-3 అంగన్వాడి కేంద్రంలో గురువారం పోషణ్ పక్వాడ కార్యక్రమాన్ని ఐసిడిఎస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య హాజరైన అనిత మాట్లాడుతూ, జిక్ ఫుడ్ తీసుకోవడం ద్వారా ఆరోగ్య అభివృద్ధికి ఆటంకాలు ఏర్పడడంతో పాటు పిల్లల మెదడు, శారీరక ఎదుగుదల తగ్గుతుందన్నారు. దానికి తో పాటు వారిలో ఏకాగ్రత లోపించడం, చిరాకు వంటి సమస్యలు వస్తాయన్నారు.జంక్ ఫుడ్ ఎక్కువగా తినడం వల్ల పిల్లల్లో రోగ నిరోధక శక్తి తగ్గి తరచుగా జబ్బుల బారిన పడుతుంటారన్నారు.పిల్లలకు ఇంట్లోనే తయారు చేసిన తాజా ఆహారాన్ని (అల్పాహారం, పండ్లు) ఇవ్వడం తల్లిదండ్రులు చిన్ననాటి నుంచే అలవాటు చేయాలన్నారు .పిల్లల ముందు తల్లిదండ్రులు కూడా జంక్ ఫుడ్ తినకుండా ఉండాలనిసూచించారు. చిన్నారులకు ఏకాగ్రతను దెబ్బతీసే సెల్ ఫోన్లను వారికి అందుబాటులో ఉంచకూడదన్నారు.పిల్లలకు చిన్న వయసు నుంచే ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను నేర్పించడం ద్వారా వారి భవిష్యత్తును ఆరోగ్యంగా ఉంచవచ్చనని వివరించారు.
ఏఎన్ఎం శ్రీవిద్య మాట్లాడుతూ,వేసవి కాలంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో అంగన్‌వాడీ చిన్నారుల ఆరోగ్యం విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యమన్నారు.ఎండ తీవ్రత వల్ల పిల్లలు వడదెబ్బకు గురయ్యే అవకాశం ఉన్నందున, సంబంధిత అంగన్వాడి కేంద్రాలనిర్వాహకులు మరియు తల్లిదండ్రులు వైద్య ఆరోగ్య సూత్రాలు పాటించాలన్నారు.చిన్నారులకు తగినంత సురక్షితమైన మరియు చల్లని త్రాగునీటిని నిరంతరం అందుబాటులో ఉంచాలని కోరారు.కేంద్రాల్లో పరిశుభ్రమైన వాతావరణం కల్పించడంతోపాటు గాలి, వెలుతురు ధారాళంగా వచ్చేలా చూడాలని,మరియు పిల్లలను ఉక్కపోతకు గురికాకుండా చూడాలని సూచనలు చేశారు.
వేసవిలో ఆహారం త్వరగా పాడయ్యే అవకాశం ఉన్నందున, తాజా మరియు వేడి ఆహారాన్ని మాత్రమే చిన్నారులకు అందించాలన్నారు. నిల్వ ఉంచిన పదార్థాల వల్ల వాంతులు, విరేచనాలు అయ్యే ప్రమాదం ఉందని గ్రహించాలని చెప్పారు.పిల్లలకు నీటితో పాటు మజ్జిగ, ఓఆర్ఎస్ , కొబ్బరి నీళ్లు వంటి ద్రవ పదార్థాలు ఎక్కువగా ఇస్తూ ఉండాలన్నారు.పిల్లల్లో అలసట, నీరసం లేదా జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే స్థానిక ఆరోగ్య కార్యకర్తను లేదా వైద్యుడిని సంప్రదించాలని కోరారు. అంగన్వాడి కేంద్రం నిర్వాహకుల ఒకరైన రాజేశ్వరి రెడ్డి మాట్లాడుతూ,ప్రభుత్వం కూడా ‘పోషణ పక్వాడా’ వంటి కార్యక్రమాల ద్వారా వేసవిలో చిన్నారులు మరియు గర్భిణుల ఆరోగ్య సంరక్షణపై అవగాహన కల్పిస్తోందన్నారు. కార్యక్రమంలో సంబంధిత అంగన్వాడీ కేంద్రాల నిర్వహకులు, ఆశా కార్యకర్తలు గర్భిణీలు, బాలింతలు చిన్నారులు పాల్గొన్నారు.
