ఏప్రిల్ 23, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామిక అభివృద్ధికి మరింత ఊపిరి పోస్తూ సీఎం నారా చంద్రబాబు నాయుడు అనకాపల్లి జిల్లాలో కీలక ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. జిల్లాలోని రాంబిల్లి వద్ద రూ.5,400 కోట్ల వ్యయంతో 6.5 గిగావాట్ల సామర్థ్యం గల రెన్యూ సోలార్ ఇన్‌గాట్-వేఫర్ ప్లాంట్‌కు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం, అనకాపల్లి జిల్లాను దేశంలోనే అగ్రస్థానంలో నిలిచే పెట్టుబడుల కేంద్రంగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు.అనకాపల్లి భవిష్యత్తులో మరో రంగారెడ్డి జిల్లాగా మారుతుందని, భారీ పెట్టుబడులు, పరిశ్రమలతో అభివృద్ధిలో కొత్త దశకు చేరుకుంటుందని తెలిపారు. గతంలో వెనుకబడిన రంగారెడ్డి జిల్లా ఎలా అభివృద్ధి చెంది సంపన్న ప్రాంతంగా మారిందో, అదే విధంగా అనకాపల్లి కూడా వేగంగా ఎదుగుతుందని పేర్కొన్నారు. విశాఖపట్నం సమీపంలో ఉండటం, రవాణా సౌకర్యాలు, పారిశ్రామిక వాతావరణం అనకాపల్లిని పెట్టుబడిదారులకు ఆకర్షణీయంగా మారుస్తున్నాయని వివరించారు. ఇటీవల ఆర్సెలార్ మిట్టల్ నిప్పాన్ ఇండియా స్టీల్ ప్లాంట్‌కు శంకుస్థాపన జరిగిన విషయాన్ని గుర్తుచేస్తూ, ఈ ప్రాంతం త్వరలోనే భారీ పరిశ్రమల హబ్‌గా మారుతుందని అన్నారు. కొత్తగా ఏర్పడుతున్న సోలార్ ప్లాంట్ ద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఇది బలాన్నిస్తుందని సీఎం తెలిపారు.
సౌర శక్తి వినియోగాన్ని విస్తరించేందుకు కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సీఎం సూచించారు. పీఎం సూర్యఘర్ పథకం కింద ప్రతి ఇంటిపై సోలార్ రూఫ్‌టాప్ వ్యవస్థలు ఏర్పాటు చేసుకోవాలని, రాష్ట్రంలో 40 లక్షల ఇళ్లకు సౌర విద్యుత్ లక్ష్యంగా పెట్టుకున్నామని వెల్లడించారు. రైతులు కూడా పీఎం కుసుమ్ పథకం ద్వారా సోలార్ పంపు సెట్లు ఏర్పాటు చేసుకుంటే విద్యుత్ ఖర్చులు తగ్గడమే కాకుండా స్వయం సమృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు.విద్యుత్ ఉత్పత్తి స్థానికంగా జరిగితే ట్రాన్స్‌మిషన్ నష్టాలు తగ్గుతాయని, గత ప్రభుత్వాలు విధించిన ట్రూ-అప్ ఛార్జీల భారం తగ్గించి ప్రజలకు ఉపశమనం కల్పించామని సీఎం వివరించారు. సుమారు రూ.4,600 కోట్ల భారాన్ని ప్రభుత్వం భరిస్తోందని, మొత్తంగా రూ.15,795 కోట్ల మేర విద్యుత్ ఛార్జీల పెంపును నివారించామని తెలిపారు.పెట్టుబడుల ఆకర్షణలో రాష్ట్రం ముందంజలో ఉందని, గత 22 నెలల్లో 802 ఒప్పందాలు కుదుర్చుకున్నామని సీఎం చెప్పారు. ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’తో పాటు ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ ద్వారా వేగంగా అనుమతులు ఇస్తూ పెట్టుబడిదారులకు అనుకూల వాతావరణం కల్పిస్తున్నామని పేర్కొన్నారు. యువతకు స్థానికంగానే ఉద్యోగాలు లభించేలా ప్రభుత్వం కృషి చేస్తోందని, ఇకపై ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాల్సిన అవసరం ఉండదని స్పష్టం చేశారు.
రాబోయే రోజుల్లో మరిన్ని కీలక ప్రాజెక్టులు రాష్ట్రానికి రానున్నాయని సీఎం తెలిపారు. ఈ నెల 28న సుమారు 15 బిలియన్ డాలర్ల పెట్టుబడితో గూగుల్ ఏఐ డేటా సెంటర్‌కు శంకుస్థాపన చేయనున్నట్లు వెల్లడించారు. జూలై నాటికి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి రానుందని, లారస్ ల్యాబ్స్ వంటి సంస్థలు కూడా భారీ పెట్టుబడులతో ముందుకొస్తున్నాయని చెప్పారు.ప్రధాని నరేంద్ర మోదీ సహకారంతో విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడుకున్నామని, రైల్వే జోన్ ఏర్పాటులోనూ పురోగతి సాధించామని సీఎం తెలిపారు. విశాఖ–రాజమహేంద్రవరం మధ్య కార్గో రవాణా కోసం నాలుగు లైన్ల స్పీడ్ రైల్ కారిడార్ అభివృద్ధి చెందుతుందని చెప్పారు. అమరావతి రాజధాని నిర్మాణంతో రాష్ట్ర భవిష్యత్తు మారిపోతుందని, పోలవరం ప్రాజెక్టును గోదావరి పుష్కరాల నాటికి పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని హామీ ఇచ్చారు.రాష్ట్రాన్ని ప్రాంతాల వారీగా సమగ్రంగా అభివృద్ధి చేసే దిశగా ప్రణాళికలు అమలు చేస్తున్నామని, విశాఖ కేంద్రంగా ఉత్తరాంధ్ర, అమరావతి కేంద్రంగా మధ్య ఆంధ్ర, తిరుపతి కేంద్రంగా రాయలసీమ అభివృద్ధిని వేగవంతం చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.
