ఏప్రిల్ 24, (నేటి తెలుగు పత్రిక): ఉత్తరాంధ్ర అభివృద్ధిపై వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలను మంత్రి గుమ్మడి సంధ్యారాణి తీవ్రంగా ఖండించారు. కూటమి ప్రభుత్వ పనితీరుపై విమర్శలు చేసే నైతిక హక్కు వైసీపీకి లేదని ఆమె స్పష్టం చేశారు.అమరావతిలో మీడియాతో మాట్లాడిన మంత్రి, మాజీ సీఎం జగన్‌పై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రం, అమరావతి అభివృద్ధిపై ఆసక్తి లేని వారిని ప్రజలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ప్రభుత్వం తన పనితీరుతో ముందుకు సాగుతుందని, ప్రతి విమర్శకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని అన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి విషయంలో వైసీపీ నేతలు అసూయతోనే విమర్శలు చేస్తున్నారని, గతంలో ఆ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేసిన వారే ఇప్పుడు మాట్లాడటం విచిత్రమని వ్యాఖ్యానించారు. విశాఖలో భూకబ్జాలు, అన్యాయాలు జరిగాయని ఆరోపించారు.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉత్తరాంధ్రలో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా సాగుతున్నాయని మంత్రి తెలిపారు. విశాఖలో పరిశ్రమలు, పెట్టుబడులు పెరుగుతున్నాయని, ప్రముఖ కంపెనీలు రాష్ట్రానికి వస్తున్నాయని చెప్పారు.స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణతో పాటు, గూగుల్ వంటి అంతర్జాతీయ సంస్థలు ఏపీకి రావడం ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితమని పేర్కొన్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది వేడుకలు కూడా గౌరవంగా నిర్వహిస్తున్నామని చెప్పారు.గత ప్రభుత్వ హయాంలో విద్యా, పారిశ్రామిక రంగాలు దెబ్బతిన్నాయని ఆరోపించిన మంత్రి, ప్రస్తుతం రాష్ట్ర అభివృద్ధి దిశగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని స్పష్టం చేశారు.
