Breaking News

హైదరాబాద్‌లో విక్రం-1 ఆర్బిట్ రాకెట్ ఆవిష్కరణ.. అంతరిక్ష రంగంలో తెలంగాణకు భారీ అడుగు

ఏప్రిల్ 25, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ అంతరిక్ష రంగంలో కీలక మైలురాయి నమోదైంది. ప్రముఖ ఎరోస్పేస్ సంస్థ స్కైరూట్ ఏరోస్పేస్ రూపొందించిన ప్రతిష్టాత్మక ‘విక్రం-1’ ఆర్బిట్ రాకెట్‌ను ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో పాటు సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, ఏరోస్పేస్ రంగంలో ప్రపంచ అగ్రగామిగా నిలవాలన్న తెలంగాణ లక్ష్య సాధనలో ఇది కీలక ఘట్టమని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో రూపొందించిన ఈ రాకెట్ త్వరలో సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రంకు తరలించి ప్రయోగానికి సిద్ధం చేయనున్నట్లు తెలిపారు. హైదరాబాద్ మామిడిపల్లిలోని జీఎంఆర్ ఏరోస్పేస్ ఇండస్ట్రియల్ పార్క్‌లో స్కైరూట్ సంస్థ ఏర్పాటు చేసిన మాక్స్-క్యూ డిజైన్ ఫెసిలిటీలో ఈ విక్రం-1 రాకెట్‌ను పూర్తిగా అభివృద్ధి చేయడం విశేషం. దేశంలో ప్రైవేట్ రంగంలో రూపొందించిన తొలి ఆర్బిటల్ రాకెట్‌గా ఇది గుర్తింపు పొందుతోంది. ఇప్పటికే 2022లో తొలి సబ్-ఆర్బిటల్ ప్రయోగంతో పేరు తెచ్చుకున్న స్కైరూట్, తక్కువ సమయంలోనే ఆర్బిటల్ దశకు చేరుకోవడం గొప్ప విజయంగా సీఎం అభినందించారు.

ఆర్టీసీ బలోపేతానికి కట్టుబడి ప్రభుత్వం.. కార్మిక సమస్యల పరిష్కారానికి చర్యలు: మంత్రి పొన్నం ప్రభాకర్

రాష్ట్రంలో ఇప్పటికే బోయింగ్, ఎయిర్‌బస్, సాఫ్రాన్ వంటి అంతర్జాతీయ సంస్థలు కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయని గుర్తుచేసిన సీఎం, 2047 నాటికి ఏరోస్పేస్ రంగంలో తెలంగాణను ప్రపంచ స్థాయి హబ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యమన్నారు. ఇంజనీరింగ్ ఎగుమతుల్లో తెలంగాణ 117.9% వృద్ధి నమోదు చేయడం ఈ దిశలో కీలక సూచికగా పేర్కొన్నారు.యువతకు నైపుణ్యాభివృద్ధి అత్యవసరమని సీఎం స్పష్టం చేశారు. ఇందుకోసం యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ (YISU), అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లు (ATCs), పాలిటెక్నిక్ కళాశాలల ద్వారా ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని తెలిపారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా కోర్సులు రూపొందించి, నైపుణ్యవంతులైన మానవ వనరులను తయారు చేయడమే లక్ష్యమన్నారు.స్కైరూట్ సీఈఓ పవన్ కుమార్ చందన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వ మద్దతు తమ సంస్థకు ఎంతో ఉపయోగపడుతోందన్నారు. YISUతో భాగస్వామ్యం చేసుకోవడానికి ఆసక్తిగా ఉన్నామని తెలిపారు. నైపుణ్య శిక్షణలో భాగస్వామ్యం ద్వారా తమ సంస్థకు అవసరమైన ప్రతిభను పెంపొందించుకోవచ్చని చెప్పారు.ఈ కార్యక్రమంలో స్కైరూట్ సహ వ్యవస్థాపకుడు నాగ భరత్ దాకా, పారిశ్రామిక వేత్త అనిల్ కుమార్ చలమలశెట్టి, సీఎం ప్రత్యేక కార్యదర్శి బి. అజిత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.మొత్తంగా విక్రం-1 రాకెట్ ఆవిష్కరణతో హైదరాబాద్ అంతరిక్ష రంగంలో కొత్త అధ్యాయం ప్రారంభమైందని, భారతదేశ ప్రైవేట్ స్పేస్ రంగానికి ఇది బలమైన పునాది అవుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఎంపీ వద్దిరాజు మున్నూరుకాపు సంఘం ఖమ్మం జిల్లా బాధ్యత స్వీకరించిన: ఆవుల రామారావు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *