ఏప్రిల్ 26, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్‌ఆర్టీసీ) మరో ప్రతిష్టాత్మక జాతీయ అవార్డును కైవసం చేసుకుంది. ప్రయాణికులకు మెరుగైన సేవలందించడంతో పాటు ఆధునిక సాంకేతికత వినియోగంలో ముందంజలో నిలుస్తున్న సంస్థకు ఈ గౌరవం లభించింది. 2026 సంవత్సరానికి గాను నిర్వహించిన “పీఎస్‌ఈ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ అవార్డ్స్”లో ఏపీఎస్‌ఆర్టీసీ ఎంపికైంది. ముఖ్యంగా యూనిఫైడ్ కమ్యూనికేషన్స్ విభాగంలో డిజిటల్ సేవలను విస్తరించడం, సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థంగా వినియోగించడం వంటి అంశాలకు గుర్తింపుగా ఈ అవార్డు అందుకుంది.హైదరాబాద్‌లో ఏప్రిల్ 24, 25 తేదీల్లో జరిగిన ఇండియా పీఎస్‌ఈ సమ్మిట్–2026లో ఈ అవార్డులు ప్రదానం చేశారు. దేశవ్యాప్తంగా ప్రజా రంగ సంస్థలలో ఆవిష్కరణలు, సాంకేతిక అభివృద్ధి, సేవల మెరుగుదలపై ఈ సమ్మిట్ ముఖ్య వేదికగా నిలిచింది. అవార్డు ప్రదాన కార్యక్రమంలో ఏపీఎస్‌ఆర్టీసీ వైస్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ ఎన్. బాలసుబ్రమణ్యం, చీఫ్ ఇంజనీర్ (ఐటి) వై. శ్రీనివాసరావు ఈ అవార్డును స్వీకరించారు. ఈ సందర్భంగా సంస్థ సాధించిన విజయంపై వారు ఆనందం వ్యక్తం చేశారు.ఈ అవార్డు సంస్థ సిబ్బంది కృషికి నిదర్శనమని పేర్కొంటూ, భవిష్యత్తులో కూడా ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు కట్టుబడి ఉంటామని అధికారులు తెలిపారు. ఇప్పటికే అనేక అవార్డులు అందుకున్న ఏపీఎస్‌ఆర్టీసీ, తాజా గౌరవంతో తన ప్రతిష్టను మరింత పెంచుకుంది.
