కోదాడ ,ఏప్రిల్ 27(నేటి తెలుగు పత్రిక): మనిషిని మనిషిని కలిపే పేగు బంధం, సమాజ సమతుల్యతను కాపాడేది సాహిత్య సాంస్కృతిక రంగాలదే నని ప్రముఖ సంగీత దర్శకుడు రచయిత గాయకుడు బీమ్స్ సిసిరోలీయ అన్నారు. మనిషి కష్టసుఖాలకు, మానవజీవన పరిణామ క్రమానికి నిలువెత్తు రూపం పాట, సంగీతం అని విశ్లేషించారు.”తెర” సాంస్కృతిక కళామండలి 33వ వార్షికోత్సవం సందర్భంగా కోదాడ లో కళా పురస్కారాన్ని బీమ్స్ సిసిరోలియో, సాహితీ పురస్కారం ప్రముఖ కవి, గాయకుడు చింతల యాదగిరిలకు ప్రధానం చేశారు.ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో సంగీత దర్శకుడు భీమ్ మాట్లాడుతూ తన పాతికేళ్ల సాంస్కృతిక ప్రయాణానికి గుర్తుగా “తెర” సాంస్కృతిక కళామండలి అవార్డును గౌరవంగా స్వీకరిస్తున్నానని తెలిపారు.దేహాన్ని తునాతునకలు చేయవచ్చును కానీ ఆ ముక్కలైన దేహం నుంచి పుట్టుకొచ్చిన పాటను కవితను ఎవరు చంపలేరని గంభీర్యంగా ఉద్వేగంతో ప్రసంగించారు.తెర సాహితీ పురస్కారాన్ని అందుకున్న చింతల యాదగిరి మాట్లాడుతూ నా చిట్టి చేతులు చక్కని రాతలు రాయలేదమ్మా అని సాహిత్య సాంస్కృతిక సంతకం చేయించింది తెలంగాణ మట్టి అని తెలిపారు. పోరాట స్ఫూర్తినిచ్చి పాటల ఉగ్గుపాలు తాపి నేర్పిన మట్టి పాఠాల్ని పాటలుగా అల్లుకుంటూ పోతున్నామన్నారు.బహుజన ఉద్యమ కవి, తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ జూలూరు గౌరీ శంకర్ మాట్లాడుతూ కుల మతాలకు అతీతంగా ప్రజలందరినీ ఒక్క దగ్గరికి చేర్చి నిలబెట్టగల శక్తి సాహిత్య సాంస్కృతిక రంగాలకు మాత్రమే ఉందని చెప్పారు. రాష్ట్ర సాహిత్య, సాంస్కృతిక,నాటక కళా రంగాల చరిత్రలో రేపాల కూచిపూడి, నడిగూడెం, కోదాడ లు చిరస్థాయిగా నిలిచిపోతాయని తెలిపారు. ఈ నేపథ్యం నుంచే కోదాడ తెలంగాణ సాహిత్య సాంస్కృతిక ముఖద్వారంగా నిలిచిపోయిందని విశ్లేషించి చెప్పారు. కోదాడ పట్టణంలో రవీంద్ర భారతి లాంటి ఆడిటోరియం నిర్మాణం చేయాలని ఈ ప్రాంత నాయకులను, ప్రజా ప్రతినిధులను, జిల్లా మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డిని కోరారు. 33 సంవత్సరాల తెర కళామండలి నిర్వాహకుడిగా వేముల వెంకటేశ్వర్లు చేస్తున్న అవిరాళ కృషిని జూలూరు ప్రశంసించారు.ఈ సభకు కవి పెద్దిరెడ్డి గణేష్ అధ్యక్షత వహించగా మున్సిపల్ చైర్మన్ ఎర్నేని కుసుమ వెంకటరత్నం ఆర్థిక శాస్త్ర నిపుణులు డాక్టర్ అందే సత్యం, రామానంద తీర్థ గ్రామీణ విద్యా సంస్థ చైర్మన్ నారా కిషోర్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు వంగవీటి రామారావు, మాజీ సర్పంచ్ పార సీతయ్య, బద్దం భద్రారెడ్డి, కళాశ్రీ భిక్షు నాయక్, సింగర్ శిరీష,దామిని చింతల, బోల్లెద్దు శ్రీపాల్, కే. సీతారాములు,ఎం. ఈ. ఓ. సలీం షరీఫ్, ఎల్బీనగర్ ఏ.సీ.పి అమర గాని కృష్ణయ్య, ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ వి. సోమిరెడ్డి, కౌన్సిలర్స్ కర్రి సుబ్బారావు, గుండపనేని పద్మ నాగేశ్వరరావు, తోట జ్యోతి శ్రీను, కట్టబోయిన శ్రీనివాస్ యాదవ్, తెర కళామండలి సభ్యులు షేక్ మీరా, షేక్ పీర్ సాహెబ్, కోలా శ్రీనివాసరావు, పాలూరి సత్యనారాయణ, పోలిశెట్టి బ్రహ్మం, గార్లపాటి వీరారెడ్డి మొదలగు వారు పాల్గొన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు, డప్పు విన్యాసాలు ఆకట్టుకున్నాయి.






