ఏప్రిల్ 29, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్ పరిసరాల్లో రూపుదిద్దుకుంటున్న భారత్ ఫ్యూచర్ సిటీ అభివృద్ధిలో స్థానిక ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం అత్యంత అవసరమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం పనిచేస్తుందని, అభివృద్ధి ఫలాలు అందరికీ చేరేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.మీఱ్ఖాన్‌పేటలో ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ భవన నిర్మాణానికి సీఎం భూమి పూజ చేశారు. అదే సమయంలో గచ్చిబౌలి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌కు శంకుస్థాపన చేసి, మల్కాజిగిరి కమిషనరేట్, ఆక్టోపస్ పరిపాలనా బ్లాక్, కుత్బుల్లాపూర్ డీసీపీ కార్యాలయ భవనాలను ప్రారంభించారు.ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, ఫ్యూచర్ సిటీని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకు సమగ్ర ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని తెలిపారు. గ్రామాలను ఫ్యూచర్ సిటీ పరిధిలో చేర్చాలనే డిమాండ్లపై గ్రామ సభల ద్వారా తీర్మానాలు చేసి పంపించాలని సూచించారు.
ఈ ప్రాంతంలో పెట్టుబడులు ఆకర్షించేందుకు గ్లోబల్ సమ్మిట్ నిర్వహించినట్లు పేర్కొన్న సీఎం, త్వరలోనే ఫ్యూచర్ సిటీ కార్యాలయం పూర్తి చేసి కార్యకలాపాలు ప్రారంభిస్తామని చెప్పారు. హైటెక్ సిటీ, ఓఆర్ఆర్, అంతర్జాతీయ విమానాశ్రయం వంటి ప్రాజెక్టులు ఎలా నిజమయ్యాయో, ఇదీ అలాగే విజయవంతమవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.ఫ్యూచర్ సిటీలో భూములు కోల్పోయే వారికి ప్రభుత్వం తగిన సహాయం అందిస్తుందని, స్కిల్ యూనివర్సిటీ ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. అభివృద్ధి పేరుతో ఎవరూ నష్టపోరని స్పష్టం చేశారు.భవిష్యత్తులో ఈ ప్రాంతం బుల్లెట్ ట్రైన్ హబ్‌గా మారనుందని, మెట్రో రైలు, భారీ బస్ టర్మినల్ వంటి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.అలాగే మావోయిస్టులకు పిలుపునిస్తూ, అజ్ఞాతంలో ఉన్న నేత గణపతి సహా అందరూ లొంగిపోవాలని కోరారు. లొంగిపోయిన వారికి భద్రత, వైద్యం, ఆర్థిక సహాయం అందిస్తామని చెప్పారు. ఇప్పటివరకు వందలాది మంది నక్సలైట్లు సాధారణ జీవితంలోకి వచ్చారని తెలిపారు.అభివృద్ధి పనులు వేగంగా కొనసాగేందుకు ప్రజలు ప్రభుత్వంపై నమ్మకం ఉంచి సహకరించాలని సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.



