ఏప్రిల్ 30, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మే 1న కృష్ణా జిల్లా పమిడిముక్కలలో పర్యటించనున్నట్లు మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. ఈ పర్యటనను విజయవంతం చేయాలని ప్రజలకు, పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు.పర్యటనలో భాగంగా సీఎం పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడంతో పాటు ప్రజా వేదిక, కార్యకర్తల సమావేశంలో కూడా హాజరవుతారని మంత్రి వివరించారు. ప్రతి నెల ఒకటో తేదీన లబ్ధిదారుల ఇళ్లకే వెళ్లి పెన్షన్లు అందించడం సీఎం అంకితభావానికి నిదర్శనమని పేర్కొన్నారు. ఒకటో తేదీ సెలవు దినంగా ఉన్నప్పుడు ముందుగానే 30 లేదా 31 తేదీల్లోనే పెన్షన్లు అందించే విధానాన్ని ప్రభుత్వం అమలు చేస్తోందని తెలిపారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా సేవలు అందించడంలో ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని చెప్పారు. ప్రభుత్వ పథకాల అమలు, ప్రజల అభిప్రాయాలను తెలుసుకోవడంలో సీఎం ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని మంత్రి వెల్లడించారు. బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ ప్రతి వారం ప్రజలతో మమేకం కావడానికి సమయం కేటాయిస్తున్నారని తెలిపారు.ఆర్టీజీఎస్ వంటి వ్యవస్థల ద్వారా ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని, సంక్షేమ పథకాల అమలులో పారదర్శకతను సీఎం నిరంతరం పర్యవేక్షిస్తున్నారని చెప్పారు.ఈ నేపథ్యంలో సీఎం పర్యటనను ఘనంగా నిర్వహించేందుకు పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని మంత్రి పార్థసారథి విజ్ఞప్తి చేశారు.
పమిడిముక్కలలో సీఎం పర్యటనకు సిద్ధం.. భారీగా హాజరవ్వాలని పార్థసారథి పిలుపు
