మే 01, (నేటి తెలుగు పత్రిక): అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి రాష్ట్ర కార్మికులకు హార్దిక శుభాకాంక్షలు తెలిపారు. శ్రమజీవుల కష్టానికి గౌరవం, గుర్తింపు ఇవ్వాలని పిలుపునిచ్చారు. ప్రతి కార్మికుడి చెమట చుక్కలో సమాజ భవిష్యత్తు దాగి ఉందని, వారి కృషి అందరికీ స్ఫూర్తిగా నిలుస్తుందని పేర్కొన్నారు.వ్యవస్థీకృత, అసంఘటిత రంగాల కార్మికుల హక్కులను కాపాడటంలో ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ద్వారా లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని చెప్పారు. ముఖ్యంగా గిగ్ వర్కర్ల కోసం ప్రత్యేక చట్టాన్ని తీసుకువచ్చి రూ. 5 లక్షల ప్రమాద బీమా అమలు చేసినట్లు వెల్లడించారు.పెండింగ్‌లో ఉన్న కారుణ్య నియామకాలను భర్తీ చేసినట్లు, సింగరేణి కార్మికులకు దసరా, దీపావళి పండుగలకు ముందుగానే బోనస్ చెల్లించినట్లు తెలిపారు. సింగరేణి చరిత్రలో తొలిసారిగా కాంట్రాక్ట్ కార్మికులకు కూడా రూ. 5 వేల బోనస్ అందించినట్లు చెప్పారు. అదనంగా, కార్మికులకు బ్యాంకుల సహకారంతో కోటి రూపాయల బీమా సౌకర్యాన్ని కల్పించినట్లు వెల్లడించారు. గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న తెలంగాణ కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటూ, వారు ఏ కారణంతో మరణించినా వారి కుటుంబాలకు రూ. 5 లక్షల ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు.
