కృష్ణా జిల్లా, మే 01, (నేటి తెలుగు పత్రిక): కార్మికుల సంక్షేమం, నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. పమిడిముక్కలలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, కార్మికులు కేవలం కూలీలుగానే కాకుండా పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని ఆకాంక్షించారు.ఈ దిశగా రాష్ట్రవ్యాప్తంగా ఆధునిక ‘లేబర్ అడ్డా’ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రకటించారు. ఇవి కేవలం కార్మికులు చేరే కేంద్రాలుగానే కాకుండా, నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాలుగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. అత్యాధునిక పరికరాలతో కార్మికులకు శిక్షణ అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు.మొదటి దశలో 15 ప్రధాన నగరాల్లో ఈ లేబర్ అడ్డాలను ఏర్పాటు చేసి, అక్కడే ఉపాధి అవకాశాలను కల్పించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. వివిధ శాఖలను నైపుణ్య పోర్టల్‌తో అనుసంధానించి ఉద్యోగ అవకాశాలను విస్తరిస్తామని పేర్కొన్నారు.కార్మికుల ఆరోగ్యంపై కూడా ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని, అమరావతిలో భారీ ఈఎస్‌ఐ ఆసుపత్రితో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కొత్త ఆసుపత్రులు నిర్మిస్తామని చెప్పారు. మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వివరించారు.అభివృద్ధి కార్యక్రమాలపై మాట్లాడుతూ, బందర్ పోర్టు నిర్మాణం వేగంగా సాగుతోందని, డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. మచిలీపట్నం బైపాస్, హైదరాబాద్–మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్ రోడ్ పనులు కూడా పురోగతిలో ఉన్నాయని చెప్పారు.ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పని చేస్తేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని సీఎం స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
