మే 02, (నేటి తెలుగు పత్రిక): రాష్ట్రంలో వేగంగా అమలవుతున్న పారిశ్రామిక ప్రాజెక్టులు, హైస్పీడ్ రైల్ కారిడార్లు, ట్రిపుల్ ఆర్ వంటి అభివృద్ధి కార్యక్రమాల నేపథ్యంలో విద్యుత్ అవసరాలు భారీగా పెరగనున్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ డిమాండ్‌కు అనుగుణంగా కొత్త సబ్‌స్టేషన్ల నిర్మాణాన్ని వెంటనే ప్రారంభించాలని అధికారులకు ఆదేశించారు.విద్యుత్ శాఖపై నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో కలిసి సీఎం కీలక సూచనలు చేశారు. ఈ సమావేశంలో ప్రజాప్రతినిధులు, ఇంధన శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.గ్రీన్ ఎనర్జీ విధానంలో భాగంగా ఇప్పటికే దరఖాస్తు చేసిన ప్రాజెక్టులకు ప్రాధాన్యంగా అనుమతులు మంజూరు చేయాలని సీఎం ఆదేశించారు. ముఖ్యంగా భారీ డేటా సెంటర్లకు అవసరమైన విద్యుత్ అనుమతులను త్వరితగతిన ఇవ్వాలని సూచించారు.సోలార్ విద్యుత్ వినియోగాన్ని విస్తరించేందుకు మహిళా సంఘాల పాత్రను పెంచాలని, స్వయం సహాయక సంఘాలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. అలాగే సోలార్ స్టౌల వినియోగంపై ప్రజల్లో చైతన్యం పెంచాలని సూచించారు.సబ్‌స్టేషన్ల సమీపంలో సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేసే కొత్త విధానాన్ని కూడా ప్రవేశపెట్టాలని సీఎం సూచించారు. పైలట్ ప్రాజెక్ట్‌గా కొన్ని ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని, మొత్తం 18 ప్లాంట్ల నిర్మాణానికి నోడల్ అధికారులను నియమించాలని ఆదేశించారు.విద్యుత్ సరఫరాలో లోపాలను తగ్గించేందుకు ఆధునిక సాంకేతికతను ఉపయోగించాలని, ముఖ్యంగా ఏఐ ఆధారిత వ్యవస్థలను అమలు చేయాలని సీఎం సూచించారు. రైతు డిస్కంలో చేరికపై ఉన్న సందేహాలను తొలగించి సిబ్బందిలో స్పష్టత తీసుకురావాలని అధికారులకు తెలిపారు.రాష్ట్రంలో నిరంతర, నాణ్యమైన విద్యుత్ సరఫరా లక్ష్యంగా ఈ చర్యలు కీలకంగా మారనున్నాయని ప్రభుత్వం భావిస్తోంది.


