హైదరాబాద్, మే 03, (నేటి తెలుగు పత్రిక): కేంద్ర ప్రభుత్వం ఏ పంటలను కొనుగోలు చేస్తుందో ముందుగా తెలుసుకుని ఆ తర్వాతే ముఖ్యమంత్రికి బహిరంగ లేఖలు రాయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకి రాదన్న విషయాన్ని గుర్తించకుండా విమర్శలు చేయడం సరైంది కాదని పేర్కొన్నారు.పంటల కొనుగోలు అంశంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాసిన లేఖకు ప్రతిస్పందనగా తుమ్మల నాగేశ్వరరావు ఏడు పేజీల లేఖను పంపించారు. రైతుల నుంచి కొనుగోలు చేసే ప్రతి గింజకు కేంద్రం డబ్బులు ఇస్తోందన్న వ్యాఖ్యలు వినడానికి బాగున్నప్పటికీ, వాస్తవ పరిస్థితులు తెలుసుకోవాలని సూచించారు.పొద్దుతిరుగుడు, సోయాబీన్ వంటి పంటలపై కేంద్రం పరిమితులు విధించినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం వాటికి మించి కొనుగోలు చేసిందని తెలిపారు. అంతేకాకుండా కేంద్రం కొనుగోలు చేయని జొన్న, మొక్కజొన్న పంటలను కూడా రాష్ట్ర ప్రభుత్వం సేకరించిందని చెప్పారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో జొన్నల కొనుగోలుకు రూ.800 కోట్లు, మొక్కజొన్నల కొనుగోలుకు రూ.2 వేల కోట్లు ఖర్చు చేసినట్లు వెల్లడించారు. రాష్ట్రంలో పండే ప్రతి పంటను కేంద్రం కొనుగోలు చేయాలని బీజేపీ నాయకులు కేంద్రాన్ని కోరాలని, ఆ తర్వాత రాష్ట్రంపై విమర్శలు చేయాలని తుమ్మల సూచించారు.
