హైదరాబాద్, మే 03, (నేటి తెలుగు పత్రిక): పే రివిజన్ కమిషన్ (పీఆర్సీ) నివేదికను తక్షణమే అందించాలని అధికారుల కమిటీకి ఆదేశాలు జారీ చేసినట్లు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తెలిపారు. నివేదిక వచ్చిన వెంటనే పీఆర్సీపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యోగ సంఘాల సంయుక్త కార్యాచరణ కమిటీ (జేఏసీ), ఎంప్లాయీస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ నాయకులతో జరిగిన సమావేశంలో సీఎం ఉద్యోగుల సంక్షేమంపై పలు కీలక విషయాలను వెల్లడించారు. వచ్చే వంద రోజుల్లో పదవీ విరమణ చేసిన ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం రూ.6 వేల కోట్లు చెల్లించనున్నట్లు చెప్పారు.నిధుల వినియోగ ప్రాధాన్యతలను నిర్ణయించే బాధ్యత ఉద్యోగ సంఘాలపైనా ఉందని పేర్కొన్నారు. గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాలు ప్రతి రెండు నెలలకు ఒకసారి సమావేశమై సమస్యలపై ప్రభుత్వానికి నివేదిక అందించాలని సూచించారు.ఉద్యోగుల డిమాండ్లపై స్పందిస్తూ, జూన్ 1లోగా ఆరోగ్య భద్రత కార్డులను అందజేస్తామని సీఎం హామీ ఇచ్చారు. ప్రభుత్వ పథకాలను విజయవంతంగా అమలు చేయడంలో ఉద్యోగుల పాత్ర కీలకమని అభినందించారు.ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగుల కోసం చర్యలు తీసుకున్నామని, ప్రతి నెల మొదటి తేదీన వేతనాలు అందేలా వ్యవస్థను బలోపేతం చేశామని తెలిపారు. అలాగే బదిలీలు పారదర్శకంగా నిర్వహించామని, పెండింగ్‌లో ఉన్న టీచర్ల బదిలీలను వివాదరహితంగా పూర్తి చేశామని గుర్తుచేశారు.ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఎంపీలు వేం నరేందర్ రెడ్డి, చామల కిరణ్ కుమార్ రెడ్డి తదితరులు, ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొన్నారు.సీఎం ఇచ్చిన హామీలతో సంతృప్తి చెందిన ఉద్యోగ సంఘాలు ఈ నెల 5న చేపట్టిన నిరసన కార్యక్రమాలతో పాటు అన్ని రకాల ఆందోళనలను ఉపసంహరించుకున్నట్లు ప్రకటించాయి.




