మే 03, (నేటి తెలుగు పత్రిక): పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌కు ముందు కీలక సూచనలు జారీ చేశారు ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ. కౌంటింగ్ ఏజెంట్లతో నిర్వహించిన వర్చువల్ సమావేశంలో ఆమె పలు దిశానిర్దేశాలు చేశారు.బీజేపీ 500 నుంచి 700 ఓట్ల ఆధిక్యంలో ఉన్న బూత్‌లలో తప్పకుండా రీకౌంటింగ్ కోరాలని పార్టీ ఏజెంట్లకు సూచించారు. అవసరమైతే 1000 ఓట్ల వరకు లీడ్ ఉన్నా కూడా రీకౌంటింగ్ డిమాండ్ చేయాలని స్పష్టం చేశారు.మే 4న 294 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో కౌంటింగ్ సమయంలో అప్రమత్తంగా ఉండాలని ఆమె పిలుపునిచ్చారు. ఆదివారం రాత్రి నుంచే కౌంటింగ్ సెంటర్ల వద్ద ఉండాలని, ఉదయాన్నే ప్రక్రియలో పాల్గొనాలని సూచించారు.కౌంటింగ్ సమయంలో సమన్వయం, నిఘా చాలా ముఖ్యమని పేర్కొన్న మమతా, ఎలాంటి అలసత్వం చూపించవద్దని హెచ్చరించారు. తాను మీడియాతో మాట్లాడే వరకు కౌంటింగ్ కేంద్రాలను విడిచిపెట్టవద్దని పార్టీ కార్యకర్తలకు సూచించారు.గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న కౌంటింగ్ కేంద్రాలకు ముందుగానే చేరుకుని ఏర్పాట్లు చేసుకోవాలని కూడా ఆదేశించారు. టీఎంసీ 200కు పైగా సీట్లు గెలుస్తుందన్న విశ్వాసాన్ని మమతా బెనర్జీ వ్యక్తం చేశారు.ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో రాజకీయ ఉత్కంఠ పెరిగిన వేళ, మమతా చేసిన ఈ వ్యాఖ్యలు జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారాయి.
500 ఓట్ల లీడ్‌లో బీజేపీ ఉంటే రీకౌంటింగ్ కోరండి: మమతా బెనర్జీ సూచనలు
