Breaking News

ఏపీని స్టీల్ హబ్‌గా తీర్చిదిద్దే దిశగా అడుగులు.. భారీ పెట్టుబడులు, లక్షల ఉద్యోగాల లక్ష్యం: చంద్రబాబు

అమరావతి, మే 06, (నేటి తెలుగు పత్రిక): రాష్ట్రంలోని అపారమైన ఇనుప ఖనిజ వనరులను పూర్తిస్థాయిలో వినియోగించుకుని ఆదాయం పెంచడంతో పాటు భారీ స్థాయిలో ఉపాధి అవకాశాలు కల్పించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. గనుల శాఖపై నిర్వహించిన సమీక్షలో ఈ దిశగా కార్యాచరణ ప్రణాళికను వేగవంతం చేయాలని ఆదేశించారు.రాష్ట్రంలో సుమారు 1,938 మిలియన్ టన్నుల ఇనుప ఖనిజ నిల్వలు ఉన్నాయని, ఇవి ఆర్థికాభివృద్ధికి కీలకంగా మారతాయని సీఎం పేర్కొన్నారు. ఇప్పటికే కొన్ని ఐరన్ ఓర్ బ్లాకులు కేటాయించిన నేపథ్యంలో, మిగిలిన బ్లాకులను కూడా తక్షణమే వివిధ కంపెనీలకు కేటాయించాలని అధికారులను ఆదేశించారు.రాయలసీమ ప్రాంతంలో ఆర్సెలార్ మిట్టల్ నిప్పాన్ ఇండియా సంస్థ ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేస్తుండగా, జేఎస్‌డబ్ల్యూ సంస్థ కూడా భారీ ప్లాంట్‌కు సిద్ధమవుతోందని సీఎం తెలిపారు. 2035 నాటికి ఉక్కు ఉత్పత్తి సామర్థ్యాన్ని గణనీయంగా పెంచేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని చెప్పారు. 2030 నాటికి ఏడాదికి 30 మెట్రిక్ టన్నులు, 2035 నాటికి 113 మెట్రిక్ టన్నుల ఇనుప ఖనిజ ఉత్పత్తి లక్ష్యంగా పనిచేయాలని నిర్దేశించారు.

వైసీపీపై మంత్రి డీబీవీ స్వామి విమర్శలు.. రాజకీయ విలువలు లేవని ఆరోపణ

భవిష్యత్తులో ఇనుప ఖనిజ వినియోగం నాలుగు రెట్లు పెరిగే అవకాశముందని, రాష్ట్రాన్ని స్టీల్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు ఇది గొప్ప అవకాశం అని సీఎం అభిప్రాయపడ్డారు. ఈ రంగంలో సుమారు రూ.1.90 లక్షల కోట్ల పెట్టుబడులు రానున్నాయని, దాదాపు 1.52 లక్షల ఉద్యోగాలు సృష్టి అవుతాయని వెల్లడించారు.తక్కువ గ్రేడ్ మాగ్నటైట్ ఖనిజాన్ని సమర్థవంతంగా వినియోగించేందుకు ప్రత్యేక విధానం తీసుకురావాలని సూచించారు. ఖనిజాల అన్వేషణ వేగవంతం చేయడంతో పాటు మైనింగ్ లీజుల మంజూరు ప్రక్రియను సులభతరం చేయాలని ఆదేశించారు.గనుల శాఖ ఆదాయం కూడా గణనీయంగా పెరుగుతోందని అధికారులు వివరించారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో రూ.3,416 కోట్ల ఆదాయం సాధించి, గత ఏడాదితో పోలిస్తే 32 శాతం వృద్ధి నమోదైంది. 2026-27 సంవత్సరానికి రూ.4,650 కోట్ల లక్ష్యాన్ని నిర్దేశిస్తూ, 36 శాతం వృద్ధి సాధించాలని నిర్ణయించారు.ఈ సమీక్షలో మంత్రి కొల్లు రవీంద్ర, ప్రభుత్వ సలహాదారు సతీష్ రెడ్డి, గనుల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ముఖేష్ కుమార్ మీనా, ఏపీఎండీసీ వైస్ చైర్మన్ ప్రవీణ్ కుమార్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

రైల్వేజోన్‌పై క్రెడిట్ చోరీ ఆరోపణలు.. జగన్‌పై పల్లా శ్రీనివాసరావు ఫైర్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *