మే 07, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో డ్రగ్స్ నిర్మూలనే పోలీస్ శాఖ తొలి ప్రాధాన్యమని డీజీపీ సీవీ ఆనంద్ స్పష్టం చేశారు. డ్రగ్స్ కేసుల్లో పదేపదే పట్టుబడే వారిపై పీడీ యాక్ట్ తరహా కఠిన చట్టాలను అమలు చేస్తామని హెచ్చరించారు. రాష్ట్ర డీజీపీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా ఈగల్ ఫోర్స్‌పై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.డ్రగ్స్ సరఫరాతో పాటు వినియోగాన్ని కూడా అరికట్టడంపై ప్రత్యేక దృష్టి పెట్టామని డీజీపీ తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించిన ఆపరేషన్ల ద్వారా పలువురు నిందితులను అరెస్ట్ చేసి భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. ఈగల్ ఫోర్స్ పనితీరుతో మంచి ఫలితాలు వస్తున్నాయని చెప్పారు.రాష్ట్రవ్యాప్తంగా డ్రగ్స్ నియంత్రణలో కమిషనర్లు, ఎస్పీలు మరింత చురుకుగా వ్యవహరించాలని డీజీపీ సూచించారు. జిల్లాల్లో నిఘా లోపాలు ఉన్నాయని సమీక్షలో తేలిందన్నారు. డ్రగ్స్ కేసుల దర్యాప్తులో అలసత్వం ప్రదర్శించే అధికారులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు.విద్యాసంస్థల్లో డ్రగ్స్ లభిస్తే సంబంధిత యాజమాన్యాలపైనా బాధ్యత ఉంటుందని సీవీ ఆనంద్ హెచ్చరించారు. రాష్ట్రవ్యాప్తంగా కేంద్ర నిధులతో డీ-అడిక్షన్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. డ్రగ్స్ సప్లయర్ల ఆస్తులను సీజ్ చేసే దిశగా కూడా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
