మే 08, (నేటి తెలుగు పత్రిక): ఫార్మా సిటీ భూసేకరణలో రైతులకు అన్యాయం జరిగిందని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశంలో పాల్గొన్న ఆమె, ఫార్మా సిటీ కోసం సేకరించిన భూములను వెంటనే రైతులకు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు.ఫార్మా సిటీ భూసేకరణకు సంబంధించిన జీవో 31ను తక్షణమే రద్దు చేయాలని కోరిన కవిత, రైతుల అంగీకారం లేకుండా భూములు సేకరించారని మండిపడ్డారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన విధానాలను ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కొనసాగిస్తోందని విమర్శించారు.ఫ్యూచర్ సిటీ పేరుతో భూసేకరణను మరింత విస్తరించి రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. కోర్టు స్టే ఉన్న భూములను కూడా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని, ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని అన్నారు.“ప్రశ్నించటం, పోరాడటం, పరిష్కరించడం మా విధానం” అని స్పష్టం చేసిన కవిత, రైతుల సమస్యలు పూర్తిగా పరిష్కారమయ్యే వరకు ఉద్యమం కొనసాగిస్తామని హెచ్చరించారు. వెలుగుమట్లలో నిరాహార దీక్షతోనే బాధితులకు న్యాయం జరిగిందని గుర్తు చేశారు.ఫ్యూచర్ సిటీ పేరుతో ప్రభుత్వం భారీ హామీలు ఇస్తోందని, కానీ వాటి వెనుక నిజాలు దాచిపెడుతోందని కవిత ఆరోపించారు. డేటా సెంటర్లు, బుల్లెట్ ట్రైన్, భారీ ఎంఓయూల పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. హైదరాబాద్ కోర్ సిటీ అభివృద్ధిని పక్కనపెట్టి కొత్త ప్రాజెక్టులపై దృష్టి పెట్టడం ప్రమాదకరమని అన్నారు.రైతుల పంట కొనుగోళ్ల విషయంలో కూడా ప్రభుత్వం స్పష్టత ఇవ్వడం లేదని కవిత పేర్కొన్నారు. వచ్చే ఏడాది నుంచి ధాన్యం కొనుగోళ్లు తగ్గించే యోచనలో ప్రభుత్వం ఉందని ఆరోపిస్తూ, రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు తమ పోరాటం కొనసాగుతుందని తెలిపారు.
