Breaking News

24 గంటల్లోనే వాహన రిజిస్ట్రేషన్‌కు ఏపీ సర్కార్ సిద్ధం

మే 08, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్‌లో కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియను వేగవంతం చేసేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. ఇకపై కొత్తగా కొనుగోలు చేసిన వాహనాలకు కేవలం 24 గంటల్లోనే శాశ్వత రిజిస్ట్రేషన్ పూర్తి చేసే విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. రవాణాశాఖ రూపొందించిన ప్రతిపాదనలకు త్వరలోనే ఆమోదం లభించే అవకాశం ఉన్నట్లు సమాచారం.ప్రస్తుతం వాహనదారులు శాశ్వత రిజిస్ట్రేషన్ కోసం రోజులు, కొన్నిసార్లు వారాల పాటు వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు లేకుండా రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తిగా పారదర్శకంగా, వేగంగా మార్చాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు.కొత్త విధానం ప్రకారం వాహనం కొనుగోలు చేసిన వెంటనే డీలర్లు తాత్కాలిక రిజిస్ట్రేషన్ పూర్తి చేసి, వివరాలను ఆన్‌లైన్‌లో రవాణాశాఖ పోర్టల్‌లో నమోదు చేస్తారు. ఆ దరఖాస్తును 24 గంటల్లోపు అధికారులు పరిశీలించి శాశ్వత రిజిస్ట్రేషన్ మంజూరు చేయాల్సి ఉంటుంది.అలాగే “ఆటో అప్రూవల్ సిస్టమ్”ను కూడా అమలు చేయనున్నారు. నిర్ణీత సమయంలో అధికారులు స్పందించకపోతే, సిస్టమ్ స్వయంచాలకంగా రిజిస్ట్రేషన్‌ను ఆమోదిస్తుంది. దీంతో పెండింగ్ ఫైళ్లు, ఆలస్యాలకు చెక్ పడనుంది.ఫ్యాన్సీ నంబర్లకు మాత్రం ఈ నిబంధన వర్తించదని అధికారులు స్పష్టం చేశారు. ప్రత్యేక నంబర్ల కోసం ప్రస్తుతం అమలులో ఉన్న వేలం విధానమే కొనసాగనుంది.ఇప్పటికే డ్రైవింగ్ లైసెన్సులు, పన్నులు, ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు వంటి సేవలను డిజిటల్ చేసిన ప్రభుత్వం.. ఇప్పుడు వాహన రిజిస్ట్రేషన్ సేవలను కూడా పూర్తిగా ఆన్‌లైన్‌లోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే సెలవు రోజుల్లో కూడా ఆన్‌లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ల పరిశీలన, ఆమోదం జరిగేలా చర్యలు తీసుకోనున్నారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్

సీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనిత

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *