Breaking News

మహిళా సాధికారతకు కొత్త దిశ.. తెలంగాణలో జిల్లా మహిళా సమాఖ్య భవనాలు సిద్ధం

మే 08, (నేటి తెలుగు పత్రిక): గ్రామీణ మహిళల ఆర్థిక, సామాజిక అభివృద్ధికి మరింత బలమైన వేదిక కల్పించే దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. స్వయం సహాయక సంఘాల మహిళలకు శాశ్వత వేదిక అందించడంతో పాటు, మహిళా సంఘాల కార్యకలాపాలను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో రాష్ట్రవ్యాప్తంగా జిల్లా మహిళా సమాఖ్య భవనాల నిర్మాణం వేగంగా కొనసాగుతోంది. మహిళల ఆర్థిక స్వావలంబనకు చిరునామాగా నిలిచే ఈ భవనాలను రాష్ట్ర ప్రభుత్వం ఆధునిక సౌకర్యాలతో నిర్మిస్తోంది.రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జూన్ 2న ఈ భవనాలను ప్రారంభించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. రాష్ట్రంలోని 22 జిల్లాల్లో నిర్మాణ పనులు చేపట్టగా, ఇప్పటికే 17 జిల్లాల్లో పనులు తుది దశకు చేరుకున్నాయి. ఒక్కో భవనాన్ని సుమారు రూ.5 కోట్ల వ్యయంతో, 15 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తున్నారు. తెలంగాణ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఈ పనులు వేగంగా కొనసాగుతున్నాయి.శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి దానకిశోర్, కమిషనర్ దివ్యా దేవరాజన్ మార్గదర్శకత్వంలో ఇంజినీరింగ్ అధికారులు జిల్లాల వారీగా పర్యటిస్తూ నిర్మాణ పనులను పర్యవేక్షిస్తున్నారు. మహిళా సంఘాలకు శాశ్వత కార్యాలయాలు లేకపోవడం వల్ల ఇంతకాలం సమావేశాలు, శిక్షణా కార్యక్రమాలు, ఉత్పత్తుల ప్రదర్శనలు నిర్వహించడంలో ఇబ్బందులు ఎదురయ్యేవి. ఇప్పుడు నిర్మాణం జరుగుతున్న ఈ సమాఖ్య భవనాలు మహిళా సంఘాలకు శాశ్వత కేంద్రాలుగా మారనున్నాయి.ఈ భవనాల్లో మహిళలకు నైపుణ్యాభివృద్ధి శిక్షణలు, డిజిటల్ లిటరసీ కార్యక్రమాలు, బ్యాంకింగ్, ఆర్థిక నిర్వహణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రత్యేక వసతులు కల్పిస్తున్నారు. అలాగే స్వయం ఉపాధి అవకాశాలపై మార్గదర్శక శిక్షణలు కూడా ఇవ్వనున్నారు. మహిళా సంఘాలు తయారు చేసే ఉత్పత్తులను ప్రదర్శించి విక్రయించేందుకు ఎగ్జిబిషన్ హాళ్లు, మార్కెటింగ్ సపోర్ట్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నారు.అదనంగా సమావేశ హాళ్లు, శిక్షణా కేంద్రాలు, కార్యాలయ గదులు, ఆధునిక సదుపాయాలతో ఈ భవనాలను అభివృద్ధి చేస్తున్నారు. గ్రామీణ మహిళలు ఒకే వేదికపై చేరి తమ సమస్యలను చర్చించుకోవడం, ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన పెంపొందించుకోవడం, కొత్త ఉపాధి అవకాశాలను అన్వేషించడం వంటి అంశాలకు ఇవి కేంద్రాలుగా మారనున్నాయి.ముఖ్యంగా స్వయం సహాయక సంఘాల ఉత్పత్తులకు మార్కెట్ అవకాశాలు పెరగడం ద్వారా మహిళల ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నాయని అధికారులు భావిస్తున్నారు. గ్రామీణ మహిళల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందించడంలో కూడా ఈ సమాఖ్య భవనాలు కీలక పాత్ర పోషించనున్నాయి.ఈ సందర్భంగా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డా. దనసరి అనసూయ సీతక్క మాట్లాడుతూ, మహిళలు తెలంగాణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు బలమైన శక్తిగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. మహిళలు మరింత ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగేందుకు శాశ్వత వేదిక అవసరమనే ఆలోచనతోనే జిల్లా మహిళా సమాఖ్య భవనాలను నిర్మిస్తున్నామని తెలిపారు.“మహిళ బలపడితే కుటుంబం బలపడుతుంది.. కుటుంబం బలపడితే గ్రామం, రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. అందుకే గ్రామ స్థాయి నుంచి జిల్లా, రాష్ట్ర స్థాయి వరకు మహిళా భవనాలను నిర్మిస్తున్నాం. తెలంగాణ ఆడబిడ్డల ఆర్థిక ప్రగతికి చిరునామాగా నిలిచే ఈ భవనాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తాయి” అని మంత్రి సీతక్క పేర్కొన్నారు.

కరీంనగర్ ఘటనపై డీజీపీకి బీఆర్‌ఎస్ ఫిర్యాదు

ప్రజల భాగస్వామ్యంతోనే మూసీ అభివృద్ధి: కేబినెట్ సబ్ కమిటీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *