మే 09, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న “ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక” కార్యక్రమంలో భాగంగా చేపట్టిన “రైతు వారం” రాష్ట్రవ్యాప్తంగా విశేష స్పందన పొందుతోంది. ఆధునిక వ్యవసాయ పద్ధతులు, శాస్త్రీయ సాగు విధానాలపై రైతులకు అవగాహన కల్పిస్తూ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తోంది.మే 4 నుంచి 9 వరకు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాల్లో వ్యవసాయ శాఖతో పాటు అనుబంధ శాఖలు సమన్వయంతో రైతులకు వివిధ రంగాలపై శిక్షణ అందిస్తున్నాయి. వికారాబాద్ జిల్లా తాండూరులో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతు వారం కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా సేంద్రియ రైతుల ఉత్పత్తుల విక్రయాల కోసం రూపొందించిన “టీజీ ఆర్గానిక్స్” మొబైల్ యాప్‌ను ప్రారంభించారు.రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 14,565 మట్టి నమూనాలు సేకరించి, 20,734 మట్టి విశ్లేషణ పత్రాలను రైతులకు అందజేశారు. నానో ఎరువుల వినియోగం, ప్రకృతి వ్యవసాయం, సన్న వరి సాగు వంటి అంశాలపై రైతులకు శాస్త్రీయ అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమాల్లో లక్షా 32 వేల మందికి పైగా రైతులు పాల్గొనడం విశేషం.హనుమకొండలో నిర్వహించిన మెగా రైతు మేళాలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖ పాల్గొన్నారు. ప్రత్యామ్నాయ పంటల సాగు, ముఖ్యంగా ఆయిల్ పామ్, నూనెగింజలు, పప్పుధాన్యాల సాగుపై రైతులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. నీటి పొదుపు కోసం బిందు సేద్యం వంటి ఆధునిక సాంకేతిక పద్ధతుల వినియోగంపై అవగాహన కల్పించారు.మండల స్థాయి సమావేశాల్లో పశుసంవర్ధక, మత్స్య, నీటిపారుదల శాఖల అధికారులు రైతులకు వేసవిలో పశువుల సంరక్షణ, పచ్చిగడ్డి సాగు, చెరువుల నిర్వహణ, చేపల ఉత్పత్తి పెంపు, కాలువల మరమ్మతులపై సూచనలు చేశారు.వ్యవసాయ ఖర్చులు తగ్గించి, దిగుబడులు పెంచడంతో పాటు రైతుల ఆదాయం పెరగాలన్నదే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రులు పేర్కొన్నారు. రైతుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించి తెలంగాణ వ్యవసాయ రంగాన్ని దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.
