మే 09, (నేటి తెలుగు పత్రిక): పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు సాధన సభలో తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ప్రభుత్వాలపై తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణకు నీటి విషయంలో అన్యాయం జరుగుతోందని, దీనిని సరిచేయడానికే తెలంగాణ రక్షణ సేన ఏర్పడిందని తెలిపారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా పాలమూరుకు కృష్ణా జలాలు అందలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పదేళ్లు అధికారంలో ఉన్నా, కాంగ్రెస్ ప్రభుత్వం రెండున్నరేళ్లు గడిచినా పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తికాలేదని విమర్శించారు.33 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసినా ప్రాజెక్టు ద్వారా ఒక్క ఎకరానికి కూడా నీళ్లు అందలేదని ఆరోపించారు. అవసరానికి ఆంధ్ర పాలకులను విమర్శించి అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ కూడా ప్రజలకు నీళ్లు ఇవ్వలేకపోయిందన్నారు. జురాల ప్రాజెక్టును సోర్స్ పాయింట్‌గా కొనసాగించి ఉంటే పాలమూరుకు ప్రయోజనం కలిగేదని, కానీ శ్రీశైలంకు మార్చడంతో ఆంధ్రప్రదేశ్‌తో నీటి వివాదాలు పెరిగాయని అన్నారు. అప్రోచ్ ఛానెల్ పరిమాణాన్ని తగ్గించడం, కాలువలు నిర్మించకపోవడం వంటి నిర్ణయాలు ప్రాజెక్టుకు నష్టం చేశాయని విమర్శించారు.లక్ష్మిదేవిపల్లి ప్రాంతంలో రిజర్వాయర్ నిర్మిస్తే రంగారెడ్డి జిల్లాలో నాలుగు లక్షల ఎకరాలు, మహబూబ్‌నగర్ జిల్లాలో ఏడు లక్షల ఎకరాలకు సాగునీరు అందించవచ్చని కవిత పేర్కొన్నారు. అయితే ఇప్పటి వరకు ప్రభుత్వాలు ఆ దిశగా చర్యలు తీసుకోలేదన్నారు.దసరా నాటికి పాలమూరు–రంగారెడ్డి పనులు ప్రారంభించాలని, లేకపోతే ప్రాజెక్టు పరివాహక ప్రాంతంలో పాదయాత్ర చేపడతామని హెచ్చరించారు.తెలంగాణలో నీటి వనరుల వినియోగంలో తీవ్ర అసమానత ఉందని, కృష్ణా నది జలాలు ఎక్కువగా ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లిపోతున్నాయని ఆమె అన్నారు. తెలంగాణకు రావాల్సిన వాటాను సాధించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శించారు.తమ పార్టీ అధికారంలోకి వస్తే వాటర్ కమిషన్ ఏర్పాటు చేసి సాగు యోగ్యమైన ప్రతి గుంట భూమికి నీళ్లు అందిస్తామని హామీ ఇచ్చారు. చెరువుల నిర్వహణకు ప్రత్యేక లష్కర్లను నియమించి నీరు పొలాలకు చేరే వరకు పర్యవేక్షిస్తామని తెలిపారు.పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం జాతీయ హోదా కల్పించాలని కవిత డిమాండ్ చేశారు. అలాగే బీసీ జనగణన, రాష్ట్ర ప్రభుత్వం పంపిన బీసీ బిల్లుకు కేంద్రం ఆమోదం తెలపాలని ప్రధాని మోదీని కోరారు.
