మే 09, (నేటి తెలుగు పత్రిక): బీసీ విద్యార్థుల విద్యాభివృద్ధికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత తెలిపారు. విద్యతో పాటు ఆరోగ్య భద్రత, నాణ్యమైన ఆహారం అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందన్నారు. ఇటీవల విడుదలైన టెన్త్, ఇంటర్ ఫలితాల్లో బీసీ విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించడం ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు.శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గంలో బీసీ విద్యార్థులకు మెరుగైన విద్యా అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కొత్తగా మూడు బీసీ హాస్టళ్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. పరిగి, రొద్దం, సోమందేపల్లి ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్న ఈ హాస్టళ్లను వచ్చే విద్యా సంవత్సరం నుంచే ప్రారంభించేందుకు చర్యలు చేపట్టారు.పరిగి, రొద్దంలో బాలికల హాస్టళ్లు, సోమందేపల్లిలో బాలుర హాస్టల్ ఏర్పాటు చేయనున్నారు. ఈ హాస్టళ్ల నిర్వహణ కోసం వార్డెన్ల నియామక ప్రక్రియను జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారులు ప్రారంభించారు. కొత్త హాస్టళ్లలో బీసీ విద్యార్థుల ప్రవేశాలకు కూడా చర్యలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం శ్రీ సత్యసాయి జిల్లాలో 61 బీసీ హాస్టళ్లు ఉండగా, కొత్తగా ఏర్పాటు చేసే మూడు హాస్టళ్లతో ఆ సంఖ్య 64కు చేరనుంది. పెనుకొండ నియోజకవర్గంలో ఇప్పటికే నాలుగు బీసీ హాస్టళ్లు ఉన్నాయి. వాటిలో రెండు పోస్ట్ మెట్రిక్, మరో రెండు ప్రీ మెట్రిక్ హాస్టళ్లు ఉన్నాయి.కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో వార్డెన్ల నియామకానికి అధికారులు వేగంగా చర్యలు తీసుకుంటున్నారు. శాఖలో సిబ్బంది కొరత ఉండటంతో ఇతర శాఖల ఉద్యోగులను నియమించే అవకాశాలను పరిశీలిస్తున్నారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్‌కు అధికారులు లేఖ రాశారు.వచ్చిన దరఖాస్తులను పరిశీలించేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి త్వరలోనే వార్డెన్ల నియామకాలు పూర్తి చేయాలని అధికారులు నిర్ణయించారు.పేద, కూలీ కుటుంబాల పిల్లలు విద్యకు దూరం కాకూడదనే లక్ష్యంతో మంత్రి సవిత ఈ హాస్టళ్ల ఏర్పాటుకు కృషి చేశారని అధికారులు తెలిపారు.
