Breaking News

ఖరీఫ్ రైతుకు అండగా ప్రభుత్వం: మంత్రి అచ్చెన్నాయుడు

మే 09, (నేటి తెలుగు పత్రిక): ఖరీఫ్–2026 సీజన్‌ను విజయవంతంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర కార్యాచరణతో ముందుకు సాగుతోందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, సాగునీరు సమయానికి అందుబాటులో ఉంచేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.2026–27 సంవత్సరానికి రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ద్వారా రూ.294 కోట్ల బడ్జెట్‌తో 7.46 లక్షల క్వింటాళ్ల విత్తనాలను రాయితీపై రైతులకు సరఫరా చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. నాణ్యమైన విత్తనాలతో రైతులు అధిక దిగుబడులు సాధించేలా ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.ఖరీఫ్ సీజన్‌కు అవసరమైన 93 వేల క్వింటాళ్ల పచ్చిరొట్ట ఎరువు విత్తనాలను 50 శాతం రాయితీపై అందించనున్నట్లు తెలిపారు. ఇప్పటికే 30 వేల క్వింటాళ్ల విత్తనాలను సేకరించి రైతు సేవా కేంద్రాల ద్వారా పంపిణీకి సిద్ధం చేసినట్లు చెప్పారు. మిగిలిన అవసరాల కోసం టీజీఎస్‌డీసీ, హెచ్ఐఎల్, ఎన్ఎస్‌సీ, ఆంగ్రూ సంస్థల ద్వారా అదనపు విత్తనాల సేకరణ కొనసాగుతోందన్నారు.ఈ ఏడాది 2.20 లక్షల క్వింటాళ్ల వేరుశనగ విత్తనాలను 40 శాతం రాయితీపై పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. విత్తనాల సేకరణకు సంబంధించిన టెండర్ ప్రక్రియ పూర్తయిందని, మే 20 నుంచి రైతు సేవా కేంద్రాల ద్వారా పంపిణీ ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. అలాగే 1.62 లక్షల క్వింటాళ్ల వరి విత్తనాలను మే 15 నుంచి రాయితీపై అందించనున్నట్లు మంత్రి తెలిపారు. చిరుధాన్యాలు, అపరాలు తదితర విత్తనాలను జూన్ 15 నుంచి రైతు సేవా కేంద్రాల ద్వారా పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు.ఏపీ సీడ్స్ ద్వారా సరఫరా చేసే ప్రతి విత్తనాన్ని నాణ్యతా పరీక్షలు నిర్వహించిన తర్వాతే రైతులకు అందిస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు.గ్రామీణ విత్తనోత్పత్తి పథకానికి ప్రత్యామ్నాయంగా కొత్త విత్తన రకాల పెంపొందింపునకు సవరించిన సమగ్ర పథకాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. ఈ పథకం ద్వారా ఇప్పటివరకు 1,03,901 క్వింటాళ్ల విత్తనోత్పత్తి జరిగిందని, 2026–27 సంవత్సరానికి 1,20,678 క్వింటాళ్ల ఉత్పత్తి లక్ష్యంగా ప్రణాళిక రూపొందించామని చెప్పారు.గత ప్రభుత్వం 2019–20 నుంచి 2023–24 వరకు రాయితీ విత్తనాలు సరఫరా చేసిన సంస్థలకు రూ.476.94 కోట్ల బకాయిలు ఉంచిందని మంత్రి విమర్శించారు. ప్రస్తుత ప్రభుత్వం 2024–25 సంవత్సరానికి సంబంధించిన చెల్లింపులను ఇప్పటికే విడుదల చేసిందని, 2025–26 చెల్లింపుల ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు.

ఆకాశవాణి 90వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా

డిప్యూటీ సీఎం చొరవతో మస్కట్ నుంచి స్వగ్రామానికి షెహనాజ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *