Breaking News

గోదావరి జలాలపై ఢిల్లీలో కీలక చర్చలు.. కేంద్ర మంత్రితో చంద్రబాబు భేటీ

మే 09, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 11న ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. రాష్ట్రానికి సంబంధించిన జలవివాదాల అంశాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లేందుకు ఈ పర్యటనకు ప్రాధాన్యం ఏర్పడింది.ఈ సందర్భంగా కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్‌తో చంద్రబాబు సమావేశం కానున్నారు. గోదావరి జలాల పంపిణీ, సాగునీటి ప్రాజెక్టులు, అంతర్రాష్ట్ర జల వివాదాలపై ఈ భేటీలో కీలక చర్చలు జరిగే అవకాశం ఉంది.గోదావరి జలాల పంపిణీపై పునఃసమీక్ష చేపట్టేందుకు ప్రత్యేక ట్రైబ్యునల్ ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరనున్నట్లు సమాచారం. రాష్ట్ర భవిష్యత్తు అవసరాలు, సాగునీటి ప్రాజెక్టులను దృష్టిలో ఉంచుకుని నీటి వాటాలపై పునర్విమర్శ అవసరమని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. తెలంగాణలో నిర్మాణంలో ఉన్న సమ్మక్క–సారలమ్మ బ్యారేజీ అంశాన్ని కూడా చంద్రబాబు కేంద్రం ముందు ప్రస్తావించనున్నారు. ఈ ప్రాజెక్టు వల్ల దిగువ ప్రాంతాలకు నీటి ప్రవాహంపై ప్రభావం పడే అవకాశం ఉందని ఏపీ ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది.అలాగే ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన అనుమతులు, కేంద్ర జల సంఘం అభిప్రాయాలు, అంతర్రాష్ట్ర జలవివాదాల నిబంధనల అమలు వంటి అంశాలపై కేంద్ర జోక్యం కోరనున్నట్లు తెలుస్తోంది.ఈ సమావేశంలో పోలవరం ప్రాజెక్టు పురోగతి, పెండింగ్ నిధుల విడుదల అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశముంది. పోలవరం నిర్మాణాన్ని వేగవంతం చేయాలని కేంద్రాన్ని సీఎం కోరనున్నట్లు సమాచారం.కృష్ణా, గోదావరి జలాల వినియోగంపై రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాలు మళ్లీ వేడెక్కుతున్న వేళ చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు రాజకీయ ప్రాధాన్యం ఏర్పడింది.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్

సీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనిత

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *