మే 09, (నేటి తెలుగు పత్రిక): పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో చారిత్రాత్మక పరిణామం చోటుచేసుకుంది. దశాబ్దాలుగా కొనసాగిన ప్రాంతీయ పార్టీల ఆధిపత్యానికి తెరదించుతూ తొలిసారిగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. కోల్‌కతాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన ఘన కార్యక్రమంలో సువేందు అధికారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.రాష్ట్ర గవర్నర్ ఆర్.ఎన్. రవి ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం సువేందు అధికారి ప్రధాని నరేంద్ర మోదీ ఆశీర్వాదం తీసుకోవడం కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మోదీ ఆయనను అభినందిస్తూ ఆలింగనం చేసుకున్నారు. విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి రోజునే ఈ కార్యక్రమం నిర్వహించడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. వేడుక ప్రారంభానికి ముందు ప్రధాని మోదీ, సువేందు అధికారి కలిసి ఠాగూర్ చిత్రపటానికి నివాళులర్పించారు. బెంగాలీ సంస్కృతి, సంప్రదాయాలకు గౌరవం ఇస్తామని ఈ సందర్భంగా పేర్కొన్నారు.ఈ కార్యక్రమానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు సహా పలువురు ఎన్డీఏ నేతలు హాజరయ్యారు.సువేందు అధికారి కేబినెట్‌లో మరో ఐదుగురు నేతలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. మాజీ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్, అగ్నిమిత్ర పాల్, అశోక్ కీర్తానియా, క్షుదీరామ్ టుడు, నిసిత్ ప్రమాణిక్‌లకు మంత్రివర్గంలో స్థానం లభించింది.ఒకప్పుడు మమతా బెనర్జీకు అత్యంత సన్నిహితుడిగా ఉన్న సువేందు అధికారి.. తర్వాత బీజేపీలో చేరి రాష్ట్ర రాజకీయాల్లో కీలక నాయకుడిగా ఎదిగారు. తాజా ఎన్నికల్లో నందిగ్రామ్, భవానీపూర్ రెండు స్థానాల్లోనూ విజయం సాధించి తన రాజకీయ బలం చాటుకున్నారు.రెండు దశల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ భారీ విజయాన్ని నమోదు చేసింది. మొత్తం 294 స్థానాల్లో 207 సీట్లు సాధించి అధికారాన్ని దక్కించుకోగా, తృణమూల్ కాంగ్రెస్ 80 స్థానాలకే పరిమితమైంది.“సోనార్ బంగ్లా” లక్ష్యంగా అవినీతి రహిత, అభివృద్ధి ప్రధాన పాలన అందిస్తామని సీఎం సువేందు అధికారి ప్రకటించారు. ఈ ప్రమాణ స్వీకారంతో బెంగాల్ రాజకీయాల్లో కొత్త అధ్యాయం ప్రారంభమైందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
