Breaking News

ప్రధాని మోదీకి టీపీసీసీ చీఫ్ బహిరంగ లేఖ

మే 10, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం మరింత సహకారం అందించాలని కోరుతూ టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ప్రధానమంత్రి నరేంద్రమోదీకి బహిరంగ లేఖ రాశారు. ప్రధాని హైదరాబాద్ పర్యటన సందర్భంగా విడుదల చేసిన ఈ లేఖలో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన 10 కీలక అంశాలను ప్రస్తావించారు.హైదరాబాద్ మెట్రో రైలు ఫేజ్-2 విస్తరణకు తక్షణ ఆమోదం ఇవ్వాలని ఆయన కోరారు. నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలను దృష్టిలో ఉంచుకుని 122.9 కిలోమీటర్ల మెట్రో విస్తరణకు కేంద్రం సహకరించాలని విజ్ఞప్తి చేశారు. రూ.38,595 కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టును జాయింట్ వెంచర్ రూపంలో చేపట్టేందుకు అనుమతులు ఇవ్వాలని లేఖలో పేర్కొన్నారు.మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టును జాతీయ స్థాయి అర్బన్ రివర్ రీస్టోరేషన్ ప్రాజెక్టుగా గుర్తించి ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరారు. పర్యావరణ పరిరక్షణ, ప్రజారోగ్యం, పట్టణ సుందరీకరణ దృష్ట్యా ఈ ప్రాజెక్టు కీలకమని వివరించారు.రీజినల్ రింగ్ రోడ్ ఉత్తర భాగానికి కేంద్ర కేబినెట్ ఆమోదం, నిధుల మంజూరు చేయాలని, దక్షిణ భాగం నిర్మాణానికి వెంటనే అనుమతులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అలాగే రీజినల్ రింగ్ రైలు ప్రాజెక్టును వంద శాతం కేంద్ర నిధులతో చేపట్టాలని సూచించారు. హైదరాబాద్ నుంచి అమరావతి మీదుగా బందర్ పోర్ట్ వరకు 12 లేన్ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే, హైదరాబాద్-బెంగళూరు హైస్పీడ్ కారిడార్ నిర్మాణానికి కేంద్రం ముందుకు రావాలని కోరారు. రేడియల్ రోడ్ల నిర్మాణానికి కూడా భారీ ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు.హైదరాబాద్‌ను సిగ్నల్ ఫ్రీ నగరంగా మార్చేందుకు ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు, ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి కేంద్రం సహకరించాలని మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. ట్రాఫిక్ ఒత్తిడి తగ్గించేందుకు ఈ ప్రాజెక్టులు అవసరమని తెలిపారు.సెమీకండక్టర్ రంగంలో తెలంగాణకు ప్రాధాన్యం ఇవ్వాలని, హైదరాబాద్ ఫ్యాబ్ సిటీ, ఫ్యూచర్ సిటీ ప్రాంతాల్లో ప్రతిపాదిత ప్రాజెక్టులకు తక్షణ ఆమోదం ఇవ్వాలని కోరారు. ఇండియా సెమీకండక్టర్ మిషన్‌లో తెలంగాణకు ప్రత్యేక స్థానం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుకు మహారాష్ట్ర నుంచి నో అబ్జెక్షన్ వచ్చేలా కేంద్రం మధ్యవర్తిత్వం చేయాలని, అంతర్రాష్ట్ర జల వివాదాల పరిష్కారంలో చొరవ చూపాలని లేఖలో ప్రస్తావించారు.అలాగే ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని పెండింగ్ హామీల అమలు, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ పూర్తి స్థాయి అభివృద్ధి, కొత్త జిల్లాలకు నవోదయ, కేంద్రీయ విద్యాలయాల మంజూరు వంటి అంశాలను కూడా ఆయన ప్రస్తావించారు.ఈ అంశాలపై బీజేపీ ఎంపీలు, కేంద్ర మంత్రులు ప్రధాని వద్ద ఒత్తిడి తీసుకురావాలని మహేష్ కుమార్ గౌడ్ సూచించారు. తెలంగాణ ప్రయోజనాల విషయంలో స్పష్టత ఇవ్వకపోతే ప్రజలు బీజేపీని ప్రశ్నించే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు.

మాజీ ఐపీఎస్ అధికారి భార్య హత్య కేసులో ట్విస్ట్.. పనిమనిషే ప్రధాన నిందితురాలు

హైదరాబాద్‌లో తలసేమియా రన్.. జెండా ఊపి ప్రారంభించిన నారా భువనేశ్వరి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *