మే 11, (నేటి తెలుగు పత్రిక): కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తన కుమారుడు సాయి భగీరథ్‌పై నమోదైన కేసు నేపథ్యంలో తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. రాజకీయంగా తనను ఎదుర్కోలేకే ప్రత్యర్థులు కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగిన సభలో మాట్లాడిన ఆయన, ఈ వ్యవహారం పూర్తిగా రాజకీయ కుట్రలో భాగమేనని అన్నారు.తన కుమారుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు కావడంపై స్పందించిన బండి సంజయ్, ప్రధాని నరేంద్ర మోదీ సభకు ముందు తన ప్రతిష్ట దెబ్బతీయాలనే ఉద్దేశంతో ఈ ఘటనను బయటకు తీసుకొచ్చారని విమర్శించారు. “నన్ను రాజకీయంగా నిలువరించలేక ఇప్పుడు నా కుటుంబాన్ని టార్గెట్ చేస్తున్నారు. బీసీ నాయకుడిగా నా ఎదుగుదలను కొందరు జీర్ణించుకోలేకపోతున్నారు” అని వ్యాఖ్యానించారు.ప్రసంగం మధ్యలో బండి సంజయ్ భావోద్వేగానికి లోనవ్వడంతో సభలోని కార్యకర్తలు మద్దతుగా నినాదాలు చేశారు. కొద్దిసేపటి తర్వాత ఆయన మళ్లీ ప్రసంగం కొనసాగిస్తూ, నిజం బయటపడుతుందని, ఎలాంటి కుట్రలకైనా తాను భయపడనని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా, 17 ఏళ్ల బాలికను వేధించారంటూ ఆమె కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో కేసు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం కేసుపై దర్యాప్తు కొనసాగుతోందని, అన్ని కోణాల్లో విచారణ జరుగుతోందని వెల్లడించారు.ఈ వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. బీజేపీ నేతలు రాజకీయ కక్షసాధింపుగా ఆరోపిస్తుండగా, ఇతర పార్టీలు మాత్రం చట్టం ప్రకారం విచారణ జరుగుతుందని చెబుతున్నాయి. సోషల్ మీడియాలో కూడా ఈ అంశంపై పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతోంది.
