Breaking News

బీజేపీపై సీఎం రేవంత్‌రెడ్డి విమర్శల వర్షం.. తెలంగాణ హక్కుల కోసం కేంద్రంతో పోరాటం కొనసాగుతుందన్న సీఎం

మే 11, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం వేడెక్కింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వం, బీజేపీ విధానాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అదే సమయంలో రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రంతో సమన్వయం తప్పనిసరి అని స్పష్టం చేస్తూ.. తెలంగాణ హక్కుల విషయంలో మాత్రం ఎలాంటి రాజీ ఉండదని తేల్చిచెప్పారు. సోమవారం మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో సీఎం పలు కీలక అంశాలపై విస్తృతంగా స్పందించారు. ప్రధాని నరేంద్రమోదీతో జరిగిన భేటీ నుంచి బండి భగీరథ్ కేసు వరకు, మావోయిస్టుల సరెండర్ల నుంచి మహిళా రిజర్వేషన్ల వరకు అనేక అంశాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు.ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన అధికారిక కార్యక్రమంలో ప్రధాని మోదీతో కలిసి పాల్గొన్న విషయాన్ని ప్రస్తావించిన సీఎం రేవంత్‌రెడ్డి.. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. తెలంగాణకు అవసరమైన ప్రాజెక్టులు, నిధులు, మౌలిక సదుపాయాల అభివృద్ధి అంశాలపై చర్చించినట్లు తెలిపారు. “నేను బీజేపీని రాజకీయంగా ఓడించిన ముఖ్యమంత్రిని. కానీ రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంతో కలిసి పనిచేయాల్సిందే” అని వ్యాఖ్యానించారు. గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రాన్ని ప్రశ్నించలేదని, తాము మాత్రం తెలంగాణ హక్కుల కోసం పోరాడుతున్నామని ఆరోపించారు.రీజినల్ రింగ్ రోడ్, మెట్రో విస్తరణ, కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్, మూసీ ప్రాజెక్ట్ వంటి కీలక ప్రాజెక్టులకు కేంద్రం నుంచి మద్దతు కోరినట్లు సీఎం వెల్లడించారు. ముఖ్యంగా రీజినల్ రింగ్ రోడ్‌కు 50 శాతం నిధులు ఇవ్వాలని కేంద్రాన్ని అభ్యర్థించినట్లు చెప్పారు. తెలంగాణను 2034 నాటికి వన్ ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. ఈ లక్ష్యానికి కేంద్ర సహకారం కీలకమని పేర్కొన్నారు.

అయితే అభివృద్ధి అంశాల్లో సహకారం కోరుతూ మాట్లాడిన సీఎం.. రాజకీయంగా మాత్రం బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. బీజేపీని “బ్రిటిష్ జనతా పార్టీ”గా అభివర్ణిస్తూ.. విభజించి పాలించడం ఆ పార్టీ సిద్ధాంతమని మండిపడ్డారు. ముస్లింలు, క్రిస్టియన్లు, మావోయిస్టులు కూడా ఈ దేశ ప్రజలేనని, వారిని వేరు చేసి చూడటం సరైంది కాదన్నారు. “వ్యతిరేకించిన వారిని ఖతం చేయడం బీజేపీ విధానం అయితే.. వారిని ఒప్పించి సమాజంలో కలపడం కాంగ్రెస్ సిద్ధాంతం” అని వ్యాఖ్యానించారు.ఎస్ఐఆర్ వ్యవస్థను బీజేపీ రాజకీయ ఆయుధంగా ఉపయోగిస్తోందని సీఎం ఆరోపించారు. పశ్చిమ బెంగాల్‌లో లక్షలాది ఓట్లను తొలగించారని, ఏ రాష్ట్రంలో బీజేపీ బలహీనంగా ఉంటే అక్కడ ఎస్ఐఆర్‌ను ప్రయోగిస్తున్నారని విమర్శించారు. తెలంగాణలో బీజేపీ బలహీన స్థితిలో ఉందని, మున్సిపల్ ఎన్నికల్లో ఆ పార్టీ పరిస్థితి ఏంటో ప్రజలకు తెలుసని ఎద్దేవా చేశారు.విదేశాంగ విధానంపైనా సీఎం ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వానికి స్పష్టమైన విదేశాంగ విధానం లేదని విమర్శించారు. “బంగారం కొనొద్దు, విమానాల్లో ప్రయాణం చేయొద్దు అని ప్రజలకు చెప్పడం ప్రభుత్వ వైఫల్యం” అని అన్నారు. అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి దేశ ప్రయోజనాలపై చర్చించాలని కేంద్రానికి సూచించారు. ప్రధాని మోదీ అనుభవరాహిత్యం, అహంకారం వల్ల దేశం సంక్షోభంలోకి వెళ్తోందని ఆరోపించారు.మావోయిస్టుల సరెండర్లపై మాట్లాడిన సీఎం.. తెలంగాణలో 818 మంది మావోయిస్టులు లొంగిపోయారని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో శాంతి పరిస్థితులు నెలకొన్నాయని పేర్కొన్నారు. బుల్లెట్ కంటే బ్యాలెట్ శక్తివంతమని కాంగ్రెస్ ఎప్పటి నుంచో చెబుతోందని, ఇప్పుడు మావోయిస్టులు కూడా అదే మార్గాన్ని ఎంచుకుంటున్నారని వ్యాఖ్యానించారు. అవసరమైతే వారికి వైద్య సహాయం, పునరావాస సదుపాయాలు కూడా అందిస్తామని తెలిపారు.

టీఆర్ఎస్ జెండా పండుగకు కవిత పిలుపు.. గ్రామ స్థాయి వరకు పార్టీ భావజాలాన్ని తీసుకెళ్లాలని ఆదేశం

మహిళా రిజర్వేషన్ అంశంపై కూడా సీఎం స్పందించారు. 2011 జనాభా లెక్కల ఆధారంగా మహిళా రిజర్వేషన్లు అమలు చేయవచ్చని అభిప్రాయపడ్డారు. నియోజకవర్గాల పునర్విభజనపై స్పష్టత అవసరమని అన్నారు. జమిలి ఎన్నికలు 2029లో జరిగే అవకాశముందని కూడా వ్యాఖ్యానించారు.కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌పై నమోదైన కేసుపై కూడా సీఎం స్పందించారు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ప్రధాని మోదీ పర్యటన భద్రతా ఏర్పాట్ల కారణంగా విచారణ ఆలస్యమైందని, ప్రస్తుతం ప్రత్యేక అధికారులతో దర్యాప్తు వేగవంతం చేశామని చెప్పారు. “చట్టానికి ఎవరూ అతీతులు కారు” అని స్పష్టం చేశారు.రైతుల సమస్యలపై మాట్లాడుతూ.. అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. తడిసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వం కొనుగోలు చేస్తోందని తెలిపారు. రైతులకు పంట మార్పిడి, సాగు విధానాలపై అవగాహన కల్పించేందుకు కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు.తుమ్మిడిహట్టి ప్రాజెక్ట్ అంశంపై మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నట్లు సీఎం వెల్లడించారు. అవసరమైతే ప్రధాని మోదీ జోక్యం చేసుకోవాలని కోరినట్లు తెలిపారు. తెలంగాణ ప్రయోజనాల విషయంలో ఎలాంటి రాజీ ఉండదని మరోసారి స్పష్టం చేశారు.

ఆలయాల కూల్చివేతపై సీఎం రేవంత్ ప్రభుత్వాన్ని హరీష్‌రావు టార్గెట్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *