Breaking News

టీఆర్ఎస్ జెండా పండుగకు కవిత పిలుపు.. గ్రామ స్థాయి వరకు పార్టీ భావజాలాన్ని తీసుకెళ్లాలని ఆదేశం

మే 11, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ రాజకీయాల్లో కొత్త ఉత్సాహాన్ని నింపేలా తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) అధ్యక్షురాలు కె. కవిత కీలక ప్రకటన చేశారు. మే 20 నుంచి జూన్ 20 వరకు రాష్ట్రవ్యాప్తంగా నెల రోజుల పాటు “టీఆర్ఎస్ జెండా పండుగ”ను ఘనంగా నిర్వహించాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నుంచి గ్రామస్థాయి వరకు ప్రతి ప్రాంతంలో పార్టీ జెండాలను ఎగురవేసి ప్రజల్లో పార్టీ భావజాలాన్ని విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు.ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ ఆత్మను మళ్లీ ప్రజల్లో జాగృతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 12 సంవత్సరాలు గడిచినా ఉద్యమ సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలు పూర్తిగా నెరవేరలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా “నీళ్లు – నిధులు – నియామకాలు” అనే తెలంగాణ ఉద్యమ ప్రధాన లక్ష్యాలు ఇంకా సాధన దశలోనే ఉన్నాయని పేర్కొన్నారు. రాష్ట్రంలోని యువత, రైతులు, ఉద్యోగార్థులు, మహిళలు, వెనుకబడిన వర్గాలు ఇప్పటికీ అనేక సమస్యలను ఎదుర్కొంటున్నాయని కవిత తెలిపారు. తెలంగాణ వచ్చిన తర్వాత ప్రజల జీవన ప్రమాణాలు పూర్తిగా మారుతాయని ఆశించినా, ప్రస్తుతం అనేక వర్గాలు అనిశ్చితిలో ఉన్నాయని అన్నారు. గతంలో వలస పాలనలో ఎదురైన పరిస్థితులను ఇప్పుడు మళ్లీ చూడాల్సి వస్తోందని విమర్శించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ పునర్నిర్మాణం కోసం మరోసారి ప్రజా ఉద్యమం అవసరమని ఆమె అభిప్రాయపడ్డారు. “తెలంగాణ రక్షణ సేన” పార్టీ ఆవిర్భావ సభలో ప్రకటించిన సిద్ధాంతాలు, పాంచజన్య ఆలోచనలను గ్రామస్థాయి వరకు తీసుకెళ్లాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ప్రతి గ్రామం, ప్రతి వార్డు, ప్రతి గడపకు పార్టీ జెండా చేరాలని, తెలంగాణ ఆత్మగౌరవాన్ని మళ్లీ ప్రజల్లో నింపాలని అన్నారు.

ఆలయాల కూల్చివేతపై సీఎం రేవంత్ ప్రభుత్వాన్ని హరీష్‌రావు టార్గెట్

జెండా పండుగ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా భారీ స్థాయిలో కార్యక్రమాలు నిర్వహించాలని పార్టీ నాయకత్వం నిర్ణయించింది. జిల్లా కేంద్రాలు, నియోజకవర్గాలు, మండలాలు, గ్రామాల్లో సమావేశాలు, ర్యాలీలు, యువజన కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. పార్టీ బలోపేతంతో పాటు కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహించే దిశగా కూడా చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.కవిత మరోసారి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ప్రతి వర్గాన్ని గుర్తు చేసుకున్నారు. స్వరాష్ట్ర సాధన కోసం పోరాడిన ప్రజలు ఇప్పుడు తెలంగాణ అభివృద్ధి, సామాజిక న్యాయం, సబ్బండ వర్గాల వికాసం కోసం కూడా ముందుకు రావాల్సిన సమయం వచ్చిందన్నారు. తెలంగాణ జాగృతి నాయకత్వం, యువత, మహిళా శక్తి కలిసి జెండా పండుగను విజయవంతం చేయాలని ఆమె కోరారు.రాబోయే రోజుల్లో తెలంగాణ రాజకీయాల్లో టీఆర్ఎస్ మరింత చురుకుగా వ్యవహరించబోతుందనే సంకేతాలను కవిత వ్యాఖ్యలు ఇస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా జెండా పండుగ నిర్వహణ ద్వారా పార్టీని గ్రామస్థాయి వరకు విస్తరించడమే లక్ష్యంగా కనిపిస్తోందని అభిప్రాయపడుతున్నారు.

బండి భగీరథ్ కేసులో సిట్ ఏర్పాటు.. రెండు కోణాల్లో దర్యాప్తు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *