Breaking News

అమరావతిలో సింగపూర్‌ తరహా ‘పుంగోల్‌’ టౌన్‌షిప్‌.. ఏపీకి గ్లోబల్‌ హబ్‌గా రూపకల్పన

మే 12, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. సింగపూర్‌లోని ఆధునిక “పుంగోల్‌” నమూనాలో అమరావతిలో సమీకృత టౌన్‌షిప్‌ను నిర్మించనున్నట్లు రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. ఈ టౌన్‌షిప్‌ దేశానికే ఆదర్శంగా నిలిచేలా రూపకల్పన చేస్తామని తెలిపారు.సింగపూర్ పర్యటనలో భాగంగా జాయింట్ ఇంప్లిమెంటేషన్ స్టీరింగ్ కమిటీ సమావేశంలో పాల్గొన్న లోకేష్, అమరావతిని స్మార్ట్‌, సుస్థిర, సాంకేతిక ఆధారిత నగరంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ప్రపంచ బ్యాంకు సహకారంతో ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లే దిశగా చర్చలు జరుగుతున్నాయని చెప్పారు.అమరావతి ఎకనామిక్ రీజియన్ అభివృద్ధికి సింగపూర్ సహకారం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఆగ్నేయాసియా దేశాలతో వాణిజ్య సంబంధాలను బలోపేతం చేయడానికి ఏపీని కీలక కేంద్రంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు లోకేష్ పేర్కొన్నారు. సింగపూర్ ద్వారా తూర్పు ఆసియా మార్కెట్లతో అనుసంధానం పెరగడం వల్ల రాష్ట్రానికి పెట్టుబడులు, పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని అభిప్రాయపడ్డారు.రాష్ట్రాన్ని గ్లోబల్ “మైస్” (మీటింగ్స్‌, ఇన్సెంటివ్స్‌, కాన్ఫరెన్సెస్‌, ఎగ్జిబిషన్స్‌) హబ్‌గా అభివృద్ధి చేయడంపై కూడా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోంది. విశాఖపట్నం, అమరావతి, తిరుపతిలో ప్రపంచస్థాయి కన్వెన్షన్ సెంటర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అంతర్జాతీయ ఈవెంట్ల నిర్వహణకు సింగిల్ విండో విధానంలో అనుమతులు ఇవ్వనున్నట్లు మంత్రి తెలిపారు.

ఏపీలో కొత్త వాహనాల రిజిస్ట్రేషన్‌కు గుడ్‌న్యూస్.. 24 గంటల్లోనే పూర్తి: మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి

సింగపూర్‌లోని సన్‌టెక్ సిటీ తరహాలో ఆధునిక మౌలిక వసతులతో కూడిన వ్యాపార, సాంకేతిక, నివాస కేంద్రాలను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. రియల్ టైమ్ గవర్నెన్స్, డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ రంగాల్లో కూడా సింగపూర్ అనుభవాన్ని వినియోగించుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి.సింగపూర్-ఏపీ భాగస్వామ్యం మరింత బలపడుతోందని లోకేష్ పేర్కొన్నారు. పరిపాలన, విద్య, పట్టణాభివృద్ధి రంగాల్లో ఇప్పటికే రెండు ప్రభుత్వాల మధ్య అవగాహనా ఒప్పందాలు కుదిరాయని తెలిపారు. ఏపీకి చెందిన మంత్రులు, ఉపాధ్యాయులు సింగపూర్‌లో శిక్షణ పొందడం ద్వారా పరిపాలనలో ఆధునిక విధానాలను నేర్చుకుంటున్నారని చెప్పారు.అలాగే సింగపూర్-ఏపీ మధ్య పోర్టు ఆధారిత వాణిజ్య కారిడార్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. విశాఖపట్నం లేదా కృష్ణపట్నం పోర్టులను సింగపూర్‌తో డిజిటల్ వాణిజ్య కారిడార్ ద్వారా అనుసంధానం చేయాలని కోరింది. గుంటూరు మిర్చి సహా రాష్ట్ర ఉత్పత్తుల ఎగుమతులను ప్రపంచ మార్కెట్లకు విస్తరించేందుకు చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించింది. పుంగోల్ మోడల్ ప్రత్యేకత ఏమిటంటే.. పరిశ్రమలు, విద్యాసంస్థలు, గ్రీన్ టెక్నాలజీ, స్మార్ట్ ట్రాన్స్‌పోర్ట్‌, పర్యావరణ హిత జీవన విధానాన్ని ఒకే వేదికపై సమీకరించడం. అదే తరహాలో అమరావతిని కూడా సాంకేతికత, ఉపాధి, ఆధునిక జీవన ప్రమాణాలకు కేంద్రంగా తీర్చిదిద్దే ప్రయత్నాలు జరుగుతున్నాయి.రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ఈ ప్రణాళికలు అమలు అయితే అమరావతి అంతర్జాతీయ పెట్టుబడులకు ఆకర్షణీయ గమ్యస్థానంగా మారే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

గౌహతికి కలిసి వెళ్లిన చంద్రబాబు-లోకేష్.. ఎన్డీయే సమావేశాలపై ఆసక్తి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *