మే 12, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్‌లోని మియాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో విషాద ఘటన చోటుచేసుకుంది. వ్యక్తిగత జీవితంలో ఎదురైన సమస్యలు, ఒంటరితనం కారణంగా ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.విజయనగరం జిల్లా వేపాడ మండలం నల్లబెల్లి గ్రామానికి చెందిన హరిపాక మాధురి (35) హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తూ మదీనగూడలోని మైత్రీ నగర్ ఫేజ్-2లో నివాసం ఉంటున్నారు. ఆమెకు సత్యనారాయణ అనే వ్యక్తితో 12 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు కూడా ఉన్నాడు.అయితే గత కొంతకాలంగా భార్యాభర్తల మధ్య విభేదాలు తలెత్తడంతో ఆరు నెలల క్రితం పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నట్లు సమాచారం. అప్పటి నుంచి మాధురి తీవ్ర మానసిక ఒత్తిడిలో ఉన్నట్లు తెలిసింది.నాలుగు రోజుల క్రితం మాధురి తల్లిదండ్రులు తమ మనవడిని తీసుకుని స్వగ్రామానికి వెళ్లగా, ఆమె ఇంట్లో ఒంటరిగా ఉంటున్నారు. ఈ క్రమంలో ఇంటి తలుపులు ఎక్కువసేపు తెరుచుకోకపోవడంతో స్థానికులకు అనుమానం కలిగింది. వారు ఇంట్లోకి వెళ్లి చూడగా మాధురి ఉరివేసుకుని మృతి చెందినట్లు గుర్తించారు.వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా, మియాపూర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ప్రాథమిక విచారణలో ఘటనాస్థలిలో ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదని పోలీసులు తెలిపారు.విడాకుల అనంతరం ఏర్పడిన ఒంటరితనం, వ్యక్తిగత మానసిక ఒత్తిడి కారణంగానే ఆమె ఈ కఠిన నిర్ణయం తీసుకుని ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. కుటుంబ సభ్యులు, సన్నిహితులను విచారిస్తూ అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.ఈ ఘటనతో స్థానికంగా విషాద వాతావరణం నెలకొంది. మానసిక ఒత్తిడి, ఒంటరితనం వంటి సమస్యలను తేలికగా తీసుకోకుండా కుటుంబ సభ్యులు, స్నేహితులు పరస్పరం మానసికంగా అండగా నిలవాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.
