మే 18, (నేటి తెలుగు పత్రిక): ఖరీఫ్-2026 సీజన్‌కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. జూన్ 1 నుంచి రాష్ట్రంలోని ప్రధాన కాలువల్లోకి సాగునీరు విడుదల చేస్తామని మంత్రులు అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు వెల్లడించారు. రైతులు ఖరీఫ్ సాగుకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.సచివాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మంత్రులు మాట్లాడుతూ.. కాలువల్లో పూడిక తొలగింపు పనులను మే చివరి నాటికి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. గత ఖరీఫ్ సీజన్‌లో 99.35 లక్షల ఎకరాలకు 888 టీఎంసీల నీరు అందించామని, రబీ సీజన్‌లో 23.67 లక్షల ఎకరాలకు 153 టీఎంసీల నీటిని సరఫరా చేశామని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్ర రిజర్వాయర్లలో 461 టీఎంసీల నీటి నిల్వలు ఉన్నాయని వెల్లడించారు.
డెల్టాల వారీగా నీటి విడుదల షెడ్యూల్
- గోదావరి డెల్టాకు – జూన్ 1 నుంచి
- వంశధార ఆయకట్టుకు – జూన్ 15 నుంచి
- కృష్ణా డెల్టాకు – జూలై 1 నుంచి
- కె.సి. కెనాల్‌కు – జూలై 15 నుంచి
- నాగార్జున సాగర్ ఆయకట్టుకు – జూలై చివరి నుంచి సాగునీరు విడుదల చేస్తామని మంత్రులు తెలిపారు.
ఇక వ్యవసాయ శాఖ అధికారులతో నిర్వహించిన వర్చువల్ సమావేశంలో మంత్రి అచ్చెన్నాయుడు ఖరీఫ్ ఏర్పాట్లు, ఎల్‌నినో ప్రభావంపై సమీక్షించారు. రాష్ట్రవ్యాప్తంగా విత్తనాలు, ఎరువులు తగినంతగా అందుబాటులో ఉన్నాయని తెలిపారు.ఎరువులు పక్కదారి పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. యూరియా సరఫరా కోసం రైతులకు ప్రత్యేక కార్డులు అందజేస్తామని, అవసరానికి అనుగుణంగా మాత్రమే యూరియా వినియోగించాలని సూచించారు. ముందస్తు నిల్వలు చేయవద్దని, నానో యూరియాను దశలవారీగా ఉపయోగించాలని రైతులకు సూచించారు.ప్రపంచ పరిస్థితులు, యుద్ధ ప్రభావం కారణంగా యూరియా దిగుమతుల్లో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని, అందువల్ల ఎరువులను జాగ్రత్తగా వినియోగించాలని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.
