Breaking News

దేశ ఆర్థిక పరిస్థితిపై రాహుల్ గాంధీ ఆందోళన

మే 20, (నేటి తెలుగు పత్రిక): దేశం తీవ్రమైన ఆర్థిక సంక్షోభం దిశగా వెళ్తోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో యువత, రైతులు, చిన్న వ్యాపారులు, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు.రెండు రోజుల పర్యటనలో భాగంగా రాయ్‌బరేలీలో మాట్లాడిన రాహుల్ గాంధీ.. దేశ ఆర్థిక వ్యవస్థ రోజు రోజుకీ బలహీనపడుతోందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల ఉద్యోగ అవకాశాలు తగ్గిపోయాయని, వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉందని, చిన్న వ్యాపారులు నిలదొక్కుకోలేకపోతున్నారని పేర్కొన్నారు.దేశ సంపద కొద్దిమంది కార్పొరేట్ సంస్థల చేతుల్లోనే కేంద్రీకృతమవుతోందని ఆరోపించిన ఆయన.. సామాన్య ప్రజలు మాత్రం పెరుగుతున్న ధరలు, నిరుద్యోగంతో ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. అదానీ, అంబానీ వంటి పెద్ద పారిశ్రామిక వేత్తలపై మాత్రం ఈ పరిస్థితుల ప్రభావం తక్కువగా ఉంటుందని వ్యాఖ్యానించారు.ప్రధాని మోదీ ప్రజలకు ఖర్చులు తగ్గించుకోవాలని సూచిస్తూనే.. తరచూ విదేశీ పర్యటనలు చేయడాన్ని రాహుల్ గాంధీ తప్పుబట్టారు. ప్రజల అసలు సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు.దేశంలో నిరుద్యోగం చరిత్రలో ఎన్నడూ లేనంతగా పెరిగిందని, చదువులు పూర్తిచేసుకున్న యువతకు సరైన ఉద్యోగాలు దొరకడం లేదని అన్నారు. రైతులు పంటలకు గిట్టుబాటు ధరలు లేక, అప్పుల భారంతో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని రాహుల్ గాంధీ విమర్శించారు. ఉపాధి కల్పన, పారిశ్రామిక వృద్ధి, వ్యవసాయాభివృద్ధిపై స్పష్టమైన ప్రణాళిక ప్రభుత్వం వద్ద కనిపించడం లేదని పేర్కొన్నారు.

తెలంగాణ అభివృద్ధికి సంపూర్ణ సహకారం: ప్రధాని మోదీ

ఒమన్ ఒప్పందంతో ఇంధన సరఫరాకు భరోసా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *