Breaking News

పారదర్శకతే ప్రభుత్వ విజయానికి పునాది: సీఎం చంద్రబాబు

మే 20, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్‌లో సుపరిపాలన, పారదర్శకత, వేగవంతమైన సేవలే ప్రభుత్వ ప్రధాన లక్ష్యాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఆర్టీజీఎస్‌ కేంద్రం నుంచి జిల్లా కలెక్టర్లు, వివిధ శాఖల అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బందితో నిర్వహించిన భారీ టెలీకాన్ఫరెన్స్‌లో సీఎం కీలక దిశానిర్దేశం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 40 వేల మంది అధికారులు, ఉద్యోగులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.ప్రజలకు అందుతున్న ప్రభుత్వ సేవల అమలు, అర్జీల పరిష్కారం, అభివృద్ధి కార్యక్రమాల పురోగతిపై సీఎం సమీక్ష నిర్వహించారు. క్షేత్రస్థాయి సిబ్బందికి నేరుగా మాట్లాడే అవకాశం కల్పించడంతో ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. కాకినాడ జిల్లాకు చెందిన ఓ ఉద్యోగి గృహనిర్మాణంపై చేసిన సూచనను సీఎం అభినందిస్తూ అమలు చేస్తామని హామీ ఇచ్చారు.ప్రజలకు సంతృప్తికర సేవలు అందించడంలో నెల్లూరు, తూర్పుగోదావరి, పల్నాడు జిల్లాలు ముందంజలో ఉన్నాయని సీఎం వెల్లడించారు. ప్రభుత్వ సేవల్లో పెన్షన్ పంపిణీ కార్యక్రమం అత్యుత్తమంగా కొనసాగుతోందని తెలిపారు.“సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది. అందరి సహకారంతోనే రాష్ట్రానికి ‘బెస్ట్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు లభించింది” అని చంద్రబాబు పేర్కొన్నారు.2047 స్వర్ణాంధ్ర లక్ష్యంగా ప్రభుత్వం పది ప్రధాన సూత్రాలతో పనిచేస్తోందని తెలిపారు. గత 23 నెలల్లో రూ.23 లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించామని, దాదాపు 24 లక్షల ఉద్యోగ అవకాశాలు సృష్టించామని వెల్లడించారు. గూగుల్, ఆర్సెలర్ మిట్టల్, ఆమ్కా వంటి సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాయని, త్వరలో బీపీసీఎల్ ప్రాజెక్టుకు శంకుస్థాపన జరగనుందని చెప్పారు.పుట్టపర్తి – బెంగళూరు మధ్య ఏరోస్పేస్ సిటీ అభివృద్ధికి ఆమ్కా ప్రాజెక్టు దోహదపడుతుందని సీఎం తెలిపారు. ప్రతి అధికారి టీమ్‌గా పని చేసి అభివృద్ధిని వేగవంతం చేయాలని సూచించారు.“ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం పెరగాలి. అదే మన బ్రాండ్ కావాలి. అవినీతి కనిపించకూడదు. ప్రతి ఒక్కరూ పారదర్శకతతో పనిచేయాలి” అని సీఎం స్పష్టం చేశారు.అర్జీల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, చిన్న సమస్యలైనా వెంటనే స్పందించి పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు. వేసవిలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

టంగుటూరి ప్రకాశం పంతులకు సీఎం చంద్రబాబు, లోకేశ్ నివాళులు

మంత్రి ఫిర్యాదుతో బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిపై కేసు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *