- కరీంనగర్ మేయర్ గా కొలగాని శ్రీనివాస్
- డిప్యూటీ మేయర్ గా వై సునీల్ రావు
కరీంనగర్, ఫిబ్రవరి 16,నేటి తెలుగు పత్రిక : కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ “మేయర్” పదవి సామాన్యుడికే దక్కింది. భారతీయ జనతా పార్టీ పక్షాన మేయర్ అభ్యర్థిగా 2వ డివిజన్ బీజేపీ కార్పొరేటర్ కొలగాని శ్రీనివాస్ పేరును ఖరారు చేసింది. డిప్యూటీ మేయర్ గా మాజీ మేయర్ సునీల్ రావును ఎంపిక చేసింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్.రామచంద్రరావు ఈ మేరకు వారి పేర్లను ఖరారు చేస్తూ లేఖపై సంతకం చేశారు. బిజేపీ లీగల్ సెల్ రాష్ట్ర నాయకులు ఆంటోనీ రెడ్డి ఆ లేఖతో కూడిన కవర్ ను తీసుకుని సోమవారం ఉదయం కరీంనగర్ కు విచ్చేశారు. ఈ నేపథ్యంలో నగరంలోని వికన్వెన్షన్ లో బీజేపీ కార్పొరేటర్ల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, బీజేపీ జిల్లా బీజేపీ కరీంనగర్ జిల్లా ఇంఛార్జీ డాక్టర్ గంగిడి మనోహర్ రెడ్డికి అందజేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ల సమక్షంలో డాక్టర్ మనోహర్ రెడ్డి హైకమాండ్ ఖరారు చేసిన పేర్లను కార్పొరేటర్లకు తెలియజేస్తూ వారి అభిప్రాయాలు చెప్పాలని కోరారు. ఈ సందర్భంగా 39వ డివిజన్ కార్పొరేటర్ మాసం గణేశ్ మేయర్ అభ్యర్ధిగా కొలగాని శ్రీనివాస్ పేరును ప్రతిపాదించగా, 62వ డివిజన్ కార్పొరేటర్ పెద్దపల్లి శ్రీలేఖ బలపర్చారు. అట్లాగే డిప్యూటీ మేయర్ అభ్యర్ధిగా సునీల్ రావు పేరును 29వ డివిజన్ కార్పొరేటర్ సోమిడి వేణు ప్రసాద్ ప్రతిపాదించగా, 51వ డివిజన్ కార్పొరేటర్ బండారి వేణు బలపర్చారు. బీజేపీ సీనియర్ కార్పొరేటర్లు చొప్పరి జయశ్రీ, వాసాల రమేశ్ సహా బీజేపీ కార్పోరేటర్లందరూ కొలగాని శ్రీనివాస్, సునీల్ రావు పేర్లను మేయర్, డిప్యూటీ మేయర్ అభ్యర్ధులుగా ఏకగ్రీవంగా ఆమోదిస్తున్నట్లు చప్పట్లతో తమ ఆమోదం తెలిపారు. అక్కడి నుండి నేరుగా ప్రత్యేక బస్సులో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కు విచ్చేసిన కార్పొరేటర్లంతా ప్రమాణ స్వీకారం చేశారు.మేయర్ గా కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ గా సునీల్ రావు ప్రమాణస్వీకారం చేశారు.

