మే 18, (నేటి తెలుగు పత్రిక): పోక్సో కేసులో రిమాండ్‌కు వెళ్లిన బండి సాయి భగీరథ్‌ను చర్లపల్లి సెంట్రల్ జైలులో సాధారణ విచారణ ఖైదీలతోనే ఉంచినట్లు జైలు అధికారులు తెలిపారు. అతడికి ఎలాంటి ప్రత్యేక సౌకర్యాలు కల్పించలేదని స్పష్టం చేశారు.కోర్టు ఆదేశాల మేరకు భగీరథ్‌ను పోలీసులు అర్ధరాత్రి సమయంలో జైలుకు తరలించారు. జైల్లో వైద్య పరీక్షలు, ఇతర ప్రక్రియలు పూర్తి చేసిన అనంతరం విచారణ ఖైదీలు ఉండే బ్యారక్‌లోనే ఉంచారు. భద్రతా కారణాల దృష్ట్యా ఇతర ఖైదీలు ఆ ప్రాంతానికి వెళ్లకుండా అధికారులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నట్లు సమాచారం.జైలులో అందించే సాధారణ ఆహారం, ఆదివారం మాంసాహార భోజనాన్ని భగీరథ్ తీసుకోలేదని తెలుస్తోంది. జైలు క్యాంటీన్ నుంచి పాలు, బ్రెడ్ తెప్పించుకుని వాటితోనే సరిపెట్టుకున్నట్లు సమాచారం.ఇదిలా ఉండగా కేసు దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. భగీరథ్ నుంచి స్వాధీనం చేసుకున్న ఐఫోన్‌ను ఫోరెన్సిక్ పరీక్షల కోసం ఎఫ్‌ఎస్‌ఎల్‌కు పంపించాలని నిర్ణయించారు. బాధిత బాలిక కుటుంబం అందజేసిన ఫొటోలు, ఇతర ఆధారాలను కూడా సాంకేతిక పరిశీలనకు పంపనున్నట్లు అధికారులు తెలిపారు.ఈ కేసులో మరిన్ని వివరాలు సేకరించేందుకు భగీరథ్‌ను పోలీసు కస్టడీకి ఇవ్వాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేయడానికి పోలీసులు సిద్ధమవుతున్నారు. కస్టడీ లభిస్తే ఆరోపణలు జరిగిన ప్రాంతాల్లో సీన్ రీకన్‌స్ట్రక్షన్ నిర్వహించే అవకాశం ఉందని సమాచారం.బాధితురాలి ఫిర్యాదులో ప్రస్తావనకు వచ్చిన పలువురి వాంగ్మూలాలు కూడా నమోదు చేసే దిశగా దర్యాప్తు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.
