8 నెలల్లో 9వేల అప్పిళ్ల పరిష్కారం.
13 శాఖల్లో జీరో పెండింగ్ రాష్ట్ర సమాచార కమిషనర్లు.
కరీంనగర్,నేటి తెలుగు పత్రిక: అధికారుల్లో జవాబుదారి తనం పెంచేందుకు ఆర్టిఐ చట్టం దోహదం చేస్తుందని, దరఖాస్తుదారుకు సమాచారం ఇప్పించడమే కమిషన్ అంతిమ లక్ష్యమని రాష్ట్ర సమాచార కమిషనర్లు పేర్కొన్నారు.కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో మంగళవారం రాష్ట్ర సమాచార కమిషనర్లు పివి శ్రీనివాసరావు, భోరెడ్డి అయోధ్య రెడ్డి, మోసినా పర్వీన్, దేశాల భోపాల్ మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2025 మే 14న రాష్ట్ర సమాచార కమిషనర్లుగా తాము బాధ్యత తీసుకునే నాటికి 17 వేలా 808 రెండవ అప్పిళ్లు రాష్ట్ర కమిషన్లో పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. 8 నెలల్లో ఇప్పటివరకు 15 జిల్లాలలో పర్యటించి అక్కడే వాదనలు విన్నామని తెలిపారు. ఇలా సుమారు 9 వేల అప్పిళ్లను పరిష్కరించామని అన్నారు. ఇంత త్వరగా అప్పిళ్లను పరిష్కరించడం దేశంలోనే మొదటిసారిగా పేర్కొన్నారు. 13 శాఖల్లో కేసుల సంఖ్య జీరోకి తెచ్చామని తెలిపారు. సగటున నెలకు 643 కేసులు పరిష్కరిస్తున్నామని వెల్లడించారు. వీలైనంత త్వరగా మిగిలిన జిల్లాల్లో పర్యటించి పెండింగ్ కేసులన్నీ పరిష్కరిస్తామని తెలిపారు. అర్జీదారుకు సమాచారం ఇప్పించడమే కమిషన్ అంతిమ లక్ష్యమని తెలిపారు.ప్రభుత్వం చేసే ప్రతి కార్యక్రమం ప్రజల ప్రయోజనం కోసమేనని రాష్ట్ర సమాచార కమిషనర్లు తెలిపారు. ప్రజా సమాచార అధికారి, సహాయ ప్రజా సమాచార అధికారి, అప్పిలేట్ అధికారులతో సమాచార హక్కు చట్టం అవగాహన కార్యక్రమం కలెక్టరేట్ ఆడిటోరియంలో మంగళవారం ఉదయం జరిగింది. దరఖాస్తులు, ఫిర్యాదులు, పరిష్కారం, పెండింగ్ దరఖాస్తులు, పరిష్కారం కోసం తీసుకునే చర్యలపై పిఐఓలతో కమిషనర్లు చర్చించారు.
ఈ సమావేశంలో రాష్ట్ర సమాచార కమిషనర్లు మాట్లాడుతూ సమాచార హక్కు చట్టంలో భాగంగా దరఖాస్తుల స్వీకరణ, కోరిన సమాచారం ఇవ్వడం, అప్పిళ్లు, పరిష్కారం వంటివి నిరంతర యజ్ఞం లాంటివని అన్నారు. దరఖాస్తుదారు కోరిన సమాచారం ఇవ్వడం ప్రభుత్వ అధికారుల తప్పనిసరి బాధ్యతని పేర్కొన్నారు.దరఖాస్తు దారుడు సమాచారం కోరినప్పుడు తప్పనిసరిగా జవాబు ఇవ్వాలని తెలిపారు. సెక్షన్ 20 ప్రకారం దరఖాస్తుదారునికి ఎటువంటి ప్రత్యుత్తరమూ ఇవ్వకపోతే సంబంధిత అధికారికి రోజుకు 250 రూపాయల అపరాధ రుసుము, క్రమశిక్షణ చర్యలు వంటివి తీసుకోబడతాయని తెలిపారు. దరఖాసుదారుడు కమిషన్ కు ఫిర్యాదు చేసిన సందర్భంలో అధికారులు తప్పనిసరిగా కమిషన్ ముందు హాజరు కావాలని, అధికారులు వారికి బదులుగా క్లర్కులను, ఇతర సిబ్బందిని పంపరాదని తెలిపారు.ప్రతి ప్రభుత్వ కార్యాలయం, సంస్థలో ఆర్టిఐ కోసం ఒక ప్రత్యేక రోజు కేటాయించి ఆరోజు దరఖాస్తులన్నిటిని పరిష్కరించేలా చూసుకోవాలని అన్నారు. ప్రతి కార్యాలయంలో ఆ కార్యాలయానికి సంబంధించిన ఫోర్ 4(1)b సమాచారం ఎప్పుడూ డిస్ప్లే చేయాలని తెలిపారు ఆ సంస్థ లేదా కార్యాలయానికి వెబ్సైట్ ఉంటే వెబ్సైట్లోనూ 4(1)b సమాచారం పొందుపరచాలని, ఈ సమాచారం తప్పనిసరి అని తెలిపారు.సమావేశంలో అడిషనల్ కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, లక్ష్మీ కిరణ్, డిఆర్ఓ వెంకటేశ్వర్లు, ఆర్డీవోలు మహేశ్వర్ రమేష్ బాబు, అడిషనల్ డీసీపీ వెంకటరమణ పాల్గొన్నారు.
