ఎ.కొండూరు ఫిబ్రవరి 19 (నేటి తెలుగు పత్రిక): ఆరోగ్య ఆంధ్ర ప్రదేశ్ లక్ష్యంగా కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నారని రాష్ట్ర ఆర్గానిక్ ప్రొడక్ట్స్ సర్టిఫికేషన్ అథారిటీ ఛైర్మన్ శావల దేవదత్ పేర్కొన్నారు.ఈ నెల 21న ఎ.కొండూరు మండలం, కృష్ణారావుపాలెంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న భారీస్థాయి సేంద్రియ మేళాకు రైతులు, ప్రకృతి వ్యవసాయ ఔత్సాహికులు పెద్దఎత్తున తరలిరావాలని,ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈనెల 21న అనగా శనివారం ఎ.కొండూరు మండలం, కృష్ణారావుపాలెంలో ప్రభుత్వం ఆధ్వర్యంలో సేంద్రియ మేళా నిర్వహించనున్న నేపథ్యంలో ఇందుకు చేస్తున్న ఏర్పాట్లను గురువారం రాష్ట్ర ఆర్గానిక్ ప్రొడక్ట్స్ సర్టిఫికేషన్ అథారిటీ ఛైర్మన్ శావల దేవదత్, అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సేంద్రియ సాగుకు అత్యంత ప్రాధాన్యమిస్తున్నారని, ఈ నేపథ్యంలో ప్రకృతిసాగులో రాష్ట్రాన్ని నెం1గా నిలిపేందుకు, ఆరోగ్య ఆంధ్ర నిర్మాణంలో ప్రతిఒక్కరం భాగస్వాములమవుదామన్నారు. చిన్నసన్నకారు రైతులకు ప్రకృతి సేద్యంపై అవగాహన కల్పించి, సుస్థిర ఆదాయం వచ్చేలా చేయిపట్టి నడిపించేందుకు కృషిచేస్తున్నట్లు తెలిపారు.ప్రకృతి వ్యవసాయంలో సేంద్రియ మేళా సరికొత్త మైలురాయని పేర్కొన్నారు. తిరువూరు, మైలవరం నియోజకవర్గ ప్రజలు ఈ మేళాకు రావాలని సూచించారు.సేంద్రియ సాగుకు ప్రభుత్వం నుంచి అందుతున్న ప్రోత్సాహకాలు, మార్కెటింగ్ సౌకర్యాలు, అధిక దిగుబడులు సాధించేందుకు మెళకువలు ఇలా వివిధ అంశాలపై ఈ మేళాలో అవగాహన కల్పించనున్నట్లు వివరించారు. అదేవిధంగా రైతులు తాము పండించిన సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తులకు మంచి ధర లభించేందుకు ఉన్న వేదికలు, మార్కెటింగ్ లింకేజీలపై అవగాహన కల్పించేందుకు అందరికీ ఒకే వేదికపైకి తీసుకొచ్చేందుకు ఈ నెల 22న ఇందిరాగాంధీ మున్సిపల్ మైదానంలో కూడా కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు.జిల్లాలో సేంద్రియ సాగును వ్యవసాయ ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు కలెక్టర్ లక్ష్మీశ మంచి కృషిచేస్తున్నట్లు రాష్ట్ర దేవదత్ అన్నారు.ఈ కార్యక్రమంలో డీపీఎం వై.శంకర్ నాయక్, డిప్యూటీ ఎంపీడీవో ఎడ్విన్ సుందర్ లాల్, మండల టిడిపి అధ్యక్షుడు భరోతు పీక్లానాయక్, జిల్లా ఎస్టీ సెల్ ప్రధాన కార్యదర్శి బి. భీమా నాయక్, మండల టిడిపి ప్రధాన కార్యదర్శి జి.రాంప్రసాద్ రెడ్డి, పిన్నమనేని శ్రీనివాసరావు,పిట్టా చైతన్య, షేక్ ఖాదర్ బాబా, తాజుద్దీన్, షేక్ మొహిద్దీన్, పోలిశెట్టిపాడు సర్పంచ్ బొల్లె పోగు చిట్టిబాబు, కొప్పుల శౌరి,ఎం. హరిబాబు, దాడి రామారావు,తదితరులు పాల్గొన్నారు.
