జాబ్ మేళాల ద్వారా ఇప్పటివరకు 1.08 లక్షల మందికి ఉద్యోగాలు
ఇండస్ట్రీ టై అప్ తో స్కిల్ డెవలప్ మెంట్ కార్యక్రమాలకు చర్యలు
సోలార్ సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ పై న్యూ సౌత్ వేల్స్ వర్సిటీతో ఒప్పందం
న్యాక్ బలోపేతం ద్వారా ప్రపంచస్థాయి భవన నిర్మాణ కార్మికులను తయారుచేస్తాం
శాసనసభలో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్.
అమరావతి, నేటి తెలుగు పత్రిక: సూపర్ -6లో ఇచ్చిన తొలి హామీ 5ఏళ్లలో 20లక్షల ఉద్యోగాల కల్పన. ఒకేరాష్ట్రం, ఒకేరాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ ప్రజాప్రభుత్వ లక్ష్యం. అందులో భాగంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక క్లస్టర్ బేస్డ్ విధానాన్ని తీసుకొని ముందుకు వెళ్తున్నాం. ఇప్పటికే సుమారు 22 క్లస్టర్లను గుర్తించామని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. శాసనసభలో స్కిల్ డెవలప్ మెంట్ కార్యక్రమాలు ఏమేరకు ఆశించిన ఫలితాలు ఇస్తున్నాయి, శిక్షణా కేంద్రాల పనితీరు, ఉద్యోగావకాశాలు, ప్రతిపాదిత నూతన పారిశ్రామిక భాగస్వామ్య వివరాలపై ఎమ్మెల్యేలు కన్నా లక్ష్మీనారాయణ,, యార్లగడ్డ వెంకట్రావు, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, వెంకటరాజు అడిగిన ప్రశ్నలకు మంత్రి లోకేష్ సమాధానమిస్తూ… రాయలసీమ, అనంతపురంలలో ఆటోమోటివ్ క్లస్టర్, కర్నూలులో రెన్యువబుల్ ఎనర్జీ, సిమెంట్ క్లస్టర్, కడప, చిత్తూరులో ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్, నెల్లూరులో గ్లాస్, ఏసీ క్లస్టర్ వస్తోంది. ప్రకాశం జిల్లాలో కంప్రెస్డ్ బయోగ్యాస్ క్లస్టర్, అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ క్లస్టర్, గోదావరి జిల్లాలో ఆక్వా క్లస్టర్, ఉత్తరాంధ్రలో ఫార్మా, మెడికల్ డివైసెస్ మ్యానుఫ్యాక్చరింగ్, స్టీల్ క్లస్టర్ వస్తున్నాయి. డ్రోన్ సిటీ, స్పేస్ సిటీ కూడా వస్తున్నాయి. ఆయా క్లస్టర్లలో వర్టికల్, హారిజంటల్ ఇంటిగ్రేషన్ చాలా అవసరం.
కేవలం బేసిక్ మ్యానుఫ్యాక్చరింగ్ మాత్రమే కాకుండా అనుబంధ తయారీ యూనిట్లు కూడా అదే క్లస్టర్ లోకి తీసుకురావాలన్నది ప్రభుత్వ లక్ష్యం. యాపిల్ మొబైల్ సంస్థ డిజైనింగ్, మార్కెటింగ్ చేస్తుంది. మ్యానుఫ్యాక్చరింగ్ ఫాక్స్ కాన్ చేస్తుంది. అయితే అన్ని కాంపొనెంట్ లను ఫాక్స్ కాన్ తయారు చేయదు. 2వేలమంది సప్లయర్స్ దగ్గర నుంచి ఫాక్స్ కాన్ కాంపొనెంట్స్ కొనుగోలు చేస్తుంది. వారందరినీ ఒక ఎకోసిస్టమ్ లోకి తీసుకురావాలన్నది మా ఆలోచన. మరొకటి గ్లాస్ మ్యానుఫ్యాక్చరింగ్. భారతదేశంలో గ్లాస్ వినియోగం పెరుగుతోంది. ఇందుకు సంబంధించిన పరిశ్రమలను ఒకే క్లస్టర్ లోకి తీసుకురావాల్సి ఉంది. మరొకటి సోలార్ సెల్ మ్యానుఫ్యాక్చరింగ్. వేఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ కు సంబంధించి ఉత్తరాంధ్రకు కొన్ని, రాయలసీమకు కొన్ని పరిశ్రమలు వస్తున్నాయి. ఇందుకు సంబంధించి యూనివర్సిటీ ఆఫ్ న్యూ సౌత్ వేల్స్ (సిడ్నీ)తో సంప్రదించి ర్యాపిడ్ ప్రొటోటైపింగ్ టెస్టింగ్, డిజైన్ సెంటర్ ను తిరుపతి ఐఐటికి తీసుకురావడానికి కృషిచేస్తున్నాం.
క్లస్టర్ విధానంలో వర్టికల్ అంటే వివిధ రకాల కంపెనీలను తీసుకురావడం. హారిజంటల్ అంటే ఎడ్యుకేషన్. అందులో స్కిల్ డెవలప్ మెంట్ కీలకమైన పాత్ర పోషిస్తుంది. కోర్సులను అప్ గ్రేడ్ చేయాల్సి ఉంది. సోలార్ సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ కు సంబంధించిన బీ.టెక్, ఎం.టెక్, రిసెర్చ్ ప్రోగ్రామ్ లను ప్రవేశపెట్టేందుకు తిరుపతి ఐఐటి డైరెక్టర్ తో మాట్లాడుతున్నాం. క్లస్టర్ లో టెస్టింగ్, సర్టిఫికేషన్ సౌకర్యాలను కల్పించాల్సి ఉంటుంది. భారతదేశంలో తయారయ్యే వంద ఏసీలలో 50 ఆంధ్రప్రదేశ్ లోనే తయారవుతున్నాయి. భారీ పరిశ్రమల మంత్రి టీజీ భరత్ కృషితో డైకిన్, ఎల్ జీ, బ్లూస్టార్ వంటి కంపెనీలు వచ్చాయి. దీనివల్ల రాబోయే రెండేళ్లలో ఏపీలో ఏసీల ఉత్పత్తి 70శాతానికి పెరుగుతుంది. నేను వాళ్లను కలిసినపుడు ఐటీఐలను తమ యూనిట్లకు అనుసంధానించాలని కోరారు. కరిక్యులమ్, ఎక్విప్ మెంట్ తామే ప్రొవైడ్ చేసి, గైడ్ చేస్తామని, ఎకోసిస్టమ్ అభివృద్ధి చేయాలని చెప్పారు. కీలకమైన హీట్ పంప్ తయారీ, టెస్టింగ్ ఫెసిలిటీ ఇక్కడే ఏర్పాటు చేయాలని కోరారు. యూరప్ పంపి ఒక్కొక హీట్ పంప్ టెస్ట్ చేయడానికి సుమారు 5లక్షల యూరోలు అవుతుంది. అందుకు అవసరమైన ఎకోసిస్టమ్ ను స్థానికంగా ఏర్పాటు చేయాల్సి ఉంది.
రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటుచేయడానికి ఎంవోయూ చేసుకున్న 760 పరిశ్రమలను మంత్రుల బృందం ట్రాక్ చేసింది. జీవోఎంలో నాతోపాటు పరిశ్రమల మంత్రి భరత్, విద్యుత్ మంత్రి గొట్టిపాటి రవికుమార్, టూరిజం మంత్రి కందుల దుర్గేష్ సభ్యులుగా ఉన్నాం. వారందరితో చర్చలు జరిపి వారికి కావాల్సిన కోర్సులు, మ్యాన్ పవర్ పై మ్యాపింగ్ చేశాం. దీనిపై ఒక్కొక సెక్టార్ కు ఒక్కొక ఇండస్ట్రీ లీడర్ ను గుర్తించి వారికి బాధ్యత అప్పగిస్తున్నాం. సిస్టమాటిక్ గా 22 క్లస్టర్లలో ఎకోసిస్టమ్ అభివృద్ధి చేస్తున్నాం. సుజలాన్ తో మాట్లాడి 5 గ్రీన్ ఎనర్జీ ల్యాబ్ లు ఏర్పాటుచేసి, ఏటా 12వేలమంది టెక్నీషియన్లకు విండ్ ఎనర్జీలో శిక్షణ ఇస్తున్నాం. ఏఐ అడ్వాన్స్ డ్ ట్రైనింగ్ కోసం మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్ తో ఒప్పందం చేసుకున్నాం. రాయల్ ఎన్ ఫీల్డ్ ఒక ఐటీఐని ఎడాప్ట్ చేసుకుని వారికి కావాల్సిన సాంకేతికతతో మెకానిక్ లకు శిక్షణ ఇస్తుంది.
యువగళం పాదయాత్రలో ఆటో మెకానిక్ లు, టూవీలర్ మెకానిక్ లను కలిశాను. ప్రస్తుతం టెక్నాలజీ అప్ గ్రేడ్ అయినందున కొత్త సాంకేతికతలపై వారికి కావాల్సిన ట్రైనింగ్ అందించడానికి ఇండస్ట్రీతో టై అప్ కావాల్సి ఉంది. ఈ నెలలోనే సెయింట్ గోబిన్స్ తో ఒక ఒప్పందం కుదుర్చుకుంటున్నాం. న్యాక్ లో ఫాల్ సీలింగ్ అండ్ డ్రైవ్ ఆన్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుచేస్తున్నాం. ఆసియన్ పెయింట్స్ ఆధ్వర్యాన మరో సీఓఈ, ఎల్ అండ్ టీ ఆధ్వర్యాన అంతర్జాతీయస్థాయి మ్యాన్ పవర్ పైప్ లైన్ ఏర్పాటు చేస్తున్నాం. అల్ట్రాటెక్, శ్రీ సిమెంట్స్ తో మాట్లాడాం. సిమెంట్ ఎకోసిస్టమ్ లో కూడా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుచేసేందుకు కృషిచేస్తున్నాం.
ప్రతి నియోజకవర్గంలో 3నెలలకు ఒకసారి జాబ్ మేళా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటివరకు 1587 జాబ్ ఫెయిర్లు నిర్వహించగా, 11,373 కంపెనీలు పాల్గొని 1,08,747 మందికి ఉద్యోగాలు కల్పించడం జరిగింది. జాబ్ మేళాల్లో ఎమ్మెల్యేలంతా భాగస్వాములు కావాలి. ప్రస్తుతం లిఫ్ట్ మెకానిక్ ల షార్టేజీ ఎక్కువగా ఉంది. నెలకు 30వేలు జీతం ఇస్తామన్నా ఆ టెక్నీషియన్లు దొరకడం లేదు. ఎలక్ట్రీషియన్లు, క్వాలిటీ ప్లంబర్లకు కూడా తీవ్రమైన కొరత ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏపీ ఎస్ఎస్ డీసీ, సీడాప్, న్యాక్ ద్వారా 73వేలమందికి ఇప్పటికే శిక్షణ ఇచ్చాం. అందులో 40వేలమందికి ఉద్యోగాలు లభించాయి. కులవృత్తులను ప్రోత్సహించేందుకు గౌరవ ప్రధానమంత్రి పీఎం విశ్వకర్మ పథకాన్ని కూడా ప్రవేశపెట్టారు. బీసీ సంక్షేమ మంత్రి, ఎంఎస్ఎంఈ మంత్రులతో మాట్లాడి ఇప్పటికే 1.89 లక్షలమందికి అందులో శిక్షణ ఇచ్చాం. క్యాంపస్ లలో ఏఐ, మిషన్ లెర్నింగ్ పై యాడ్ ఆన్ కోర్సులు తీసుకువచ్చి, 3.11 లక్షలమందికి శిక్షణ ఇచ్చాం.
ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి స్కిల్ సెన్సస్ పై విస్తృతంగా చర్చించారు. మంగళగిరిలో స్కిల్ సెన్సస్ చేపట్టాలని ప్రయత్నించినపుడు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ఆ అనుభవంతో స్కిల్ ఎసెస్ మెంట్ చేయాలని నిర్ణయించాం. అందులో భాగంగా త్వరలో నైపుణ్యం పోర్టల్ ప్రారంభించబోతున్నాం. ఇందులో ఆధార్ బేస్డ్ క్రెడెన్షియల్ వెరిఫికేషన్ తోపాటు, బిల్డ్ యువర్ ఓన్ రెస్యూమ్ కాలమ్ ద్వారా విద్యార్థులు తమ రెస్యూమ్ ను అప్ లోడ్ చేయడంతో అప్ గ్రేడ్ చేయవచ్చు. ఇందులో ఆన్ లైన్, ఆఫ్ లైన్ ద్వారా ఏఐ బేస్డ్ స్కిల్ కోర్సులను కూడా నేర్చుకోవడానికి అవకాశం కల్పిస్తాం. కాన్వర్సేషన్ ఏఐ టూల్ ద్వారా సెల్ఫ్ ఎసెస్ మెంట్ చేసుకోవడానికి ఇందులో అవకాశం ఉంటుంది. ఏసీ మెకానిక్ నుంచి ఏఐ ఇంజనీర్ వరకు ఎసెస్ మెంట్ కు అవకాశం కలుగుతుంది. ప్రపంచంలోనే తొలిసారిగా ఇటువంటి పోర్టల్ ను ప్రవేశపెట్టబోతున్నాం. మార్చి చివరి నాటికి ఇది పూర్తిస్థాయిలో సిద్ధమవుతుంది. ఏఐ బేస్డ్ ఎగ్రిగేషన్ ద్వారా ఉద్యోగ అవకాశాలను కూడా ఇందులో అందుబాటులో ఉంచుతాం. ఏఐ ట్యూటర్ ద్వారా ఇంటర్వ్యూలకు శిక్షణ కూడా ఇస్తాం.
నర్సింగ్ పై పారా మెడికల్ కోర్సుల్లో కూడా ట్రైనింగ్ ఇవ్వాలని సభ్యులు కోరారు. యూరప్, జపాన్, జర్మనీలలో ఈ కోర్సులకు చాలా డిమాండ్ ఉంది. ఇందుకోసం ఓంక్యాప్ ద్వారా లాంగ్వేజ్ ట్రైనింగ్ చేస్తున్నాం. ఇప్పటికే 150మందిని వివిధ దేశాలకు పంపించాం. 5లక్షలమందిని విదేశాలకు పంపడం మా లక్ష్యం. గతంలో ఎపెక్స్ స్కిల్ యూనివర్సిటీ, పార్లమెంటు, నియోజకవర్గ కేంద్రాల్లో స్కిల్ కాలేజి ఏర్పాటుచేస్తామని హామీ ఇచ్చారు కానీ ఒక్కటి కూడా అమలుకాలేదు. గతంలో స్కిల్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ సిబ్బందితో పార్టీ పనిచేయించి ఉంటే విచారణ జరిపి చర్యలు తీసుకుంటాం. జాబ్ మేళాల నిర్వహణలో క్వాలిటీ పెంచుతాం. అందరం కలిసికట్టుగా పనిచేస్తే 175 నియోజకవర్గాల్లో ప్రతి యువకుడికి ఉద్యోగం కల్పించవచ్చు. ప్రతి స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ ను సీసీ టీవీ మానిటరింగ్ ద్వారా పర్యవేక్షిస్తున్నాం. ఫేషియల్ రిక్నగ్నిషన్ సిస్టమ్ కూడా అమలు చేస్తున్నాం. డైట్, బి.ఎడ్, ఇంజనీరింగ్ కాలేజీలలో కూడా ఎఫ్ఆర్ఎస్ పెట్టాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. న్యాక్ ను బలోపేతం చేసి, వరల్డ్ క్లాస్ క్వాలిటీ వర్కర్స్ ను తయారు చేస్తాం. రాబోయే 90రోజుల్లో యుద్ధ ప్రాతిపదికన న్యాక్ ను బలోపేతం చేసే చర్యలు చేపట్టబోతున్నాం. ఇంటర్న్ షిప్ ప్రోగ్రామ్ పై యార్లగడ్డ నేతృత్వంలో ఐదుగురితో ఒక కమిటీ వేస్తామని మంత్రి లోకేష్ పేర్కొన్నారు.
