- అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులకు అల్పాహారం అందించనున్న ప్రభుత్వం
- తొలుత కొన్ని జిల్లాల్లో పైలట్ ప్రాజెక్ట్, తర్వాత రాష్ట్రవ్యాప్తంగా అమలు
- పోషకలోప రహిత తెలంగాణ లక్ష్యంగా చర్యలు
- 2,199 కొత్త భవనాల మంజూరు… నిర్మాణాలు వేగవంతం చేయాలని ఆదేశం
హైదరాబాద్,ఫిబ్రవరి 28( నేటి తెలుగు పత్రిక ): తెలంగాణలో అంగన్‌వాడీ వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం చిన్నారులు, గర్భిణీలు, బాలింతలకు సమతుల్య పోషకాహారం అందించేందుకు పలు కార్యక్రమాలు అమలు చేస్తున్న నేపథ్యంలో… ఇప్పుడు అంగన్‌వాడీ చిన్నారులకు ఉదయాన్నే అల్పాహారం అందించే కొత్త పథకాన్ని ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది.ఈ విషయాన్ని రాష్ట్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి దన్సరి అనసూయ సీతక్క వెల్లడించారు. తొలుత కొన్ని జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేసి, కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలని అధికారులకు సూచించారు.
పోషకలోప నిర్మూలన లక్ష్యం
తెలంగాణను చిన్నారులు, గర్భిణీల్లో పోషక లోపం లేని రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో కౌమార బాలికల్లో రక్తహీనత సమస్య తగ్గించేందుకు ప్రత్యేక అదనపు పోషకాహార పథకం అమల్లో ఉందన్నారు. దీన్ని రాష్ట్రవ్యాప్తంగా విస్తరించే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.
భవన నిర్మాణాలకు వేగం
రాష్ట్రంలో 2,199 అంగన్‌వాడీ కేంద్రాలకు కొత్త భవనాలు మంజూరు కాగా, ఇప్పటివరకు 500 మాత్రమే పూర్తయ్యాయి. మిగిలిన నిర్మాణాలను వేగవంతం చేయాలని మంత్రి సూచించారు.‘సాక్ష్యం అంగన్‌వాడీ’ కార్యక్రమం ద్వారా అన్ని కేంద్రాల్లో మెరుగైన పోషకాహారం, ప్రీ-స్కూల్ విద్య, పరిశుభ్రమైన వాతావరణం కల్పించేందుకు చర్యలు కొనసాగుతున్నాయి. ములుగు జిల్లా లో పైలట్ ప్రాజెక్ట్‌గా చిన్నారులకు పాలు అందిస్తున్నట్లు తెలిపారు.బాల్యవివాహాల నిర్మూలన కోసం ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించి తెలంగాణను బాల్యవివాహాలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దాలని మంత్రి సూచించారు.రాబోయే రాష్ట్ర బడ్జెట్ నేపథ్యంలో శాఖ ప్రణాళికలు, ఖర్చులపై సమీక్ష నిర్వహించినట్లు అధికారులు వెల్లడించారు.
