- ఈ ఏడాది చివరికి 10 లక్షల ఇళ్లకు గృహప్రవేశాలు
- ఇల్లు లేనివారు దరఖాస్తు చేసుకోవాలని పిలుపు
- గత ప్రభుత్వ హౌసింగ్ అక్రమాలపై చర్యలు
- అగ్రిటెక్, పంచసూత్రాలతో వ్యవసాయ బలోపేతం
- రాయలసీమను ఉద్యాన హబ్‌గా తీర్చిదిద్దే ప్రణాళిక
అమరావతి,ఫిబ్రవరి 28( నేటి తెలుగు పత్రిక ): ప్రతి పేదవాడి సొంతింటి కలను సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. అసెంబ్లీలో వ్యవసాయం, హౌసింగ్ బడ్జెట్ పద్దులపై ప్రసంగిస్తూ ఆయన కీలక ప్రకటనలు చేశారు.ఇప్పటికే 3 లక్షల ఇళ్లకు గృహప్రవేశాలు చేపట్టామని, ఈ ఏడాది చివరికి 10 లక్షల ఇళ్లకు గృహప్రవేశాలు నిర్వహిస్తామని తెలిపారు. ఇల్లు లేని పేదలు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. 2029 నాటికి రాష్ట్రంలోని ప్రతి పేద కుటుంబానికి ఇల్లు, ఉచిత ఇంటి స్థలం ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ప్రకటించారు.రాష్ట్రంలో 2.2 లక్షల కుటుంబాలకు ఇంటి జాగాలు లేవని, పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు చొప్పున ఉచితంగా కేటాయిస్తామని చెప్పారు. గత ప్రభుత్వ కాలంలో హౌసింగ్ రంగంలో జరిగిన అక్రమాలను విచారించి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
వ్యవసాయానికి ఐదు సూత్రాలు
అగ్రిటెక్, నీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంటలు, ఫుడ్ ప్రాసెసింగ్, మార్కెటింగ్, ప్రభుత్వ మద్దతు అనే ఐదు సూత్రాలతో వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేస్తున్నామని సీఎం వెల్లడించారు.
- 22.5 లక్షల వ్యవసాయ పంపుసెట్లు రాష్ట్రంలో ఉన్నాయి
- ఈ ఏడాది 69 వేల కొత్త కనెక్షన్లు ఇచ్చాం
- ఉచిత విద్యుత్‌కు రూ.13,722 కోట్లు కేటాయింపు
- రైతులకు 3 విడతల్లో రూ.20,000 ఆర్థిక సహాయం
- 47 లక్షల రైతులకు రూ.6,309 కోట్లు విడుదల
- పంట నష్ట పరిహారంగా రూ.310 కోట్లు చెల్లింపు
- ధాన్యం కొనుగోళ్లలో 24 గంటల్లోనే చెల్లింపులు
వ్యవసాయ యాంత్రీకరణతో పాటు ఏఐ ఆధారిత సేవలను రైతులకు అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు.
ఫుడ్ ప్రాసెసింగ్, ఉద్యాన రంగానికి భారీ ప్రణాళికలు
ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో రూ.14,230 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు సీఎం పేర్కొన్నారు. 8,168 గ్రామాల్లో 15 లక్షల మంది ప్రకృతి సేద్యం చేస్తున్నారని తెలిపారు.రాయలసీమను ఉద్యాన హబ్‌గా తీర్చిదిద్దేందుకు రూ.30 వేల కోట్ల క్లస్టర్ ప్రణాళికతో పాటు, ప్రైవేటు పెట్టుబడులతో కలిపి రూ.1 లక్ష కోట్ల పెట్టుబడులు లక్ష్యంగా పెట్టుకున్నామని వెల్లడించారు.ఆక్వా రంగానికి యూనిట్‌కు రూ.1.50 విద్యుత్ అందిస్తున్నామని, రాష్ట్రాన్ని ఆక్వా హబ్‌గా అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఏలూరులో ప్రపంచంలోనే అతిపెద్ద కోకో సిటీ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు.నీటి భద్రత చర్యలతో భూగర్భ జలాలు పెరిగాయని, విద్యుత్ వినియోగంలో రూ.95 కోట్ల ఆదా జరిగిందని సీఎం వివరించారు.రైతులు, సాగునీటి సంఘాలు, కౌలు రైతులందరికీ ప్రభుత్వం పూర్తి మద్దతు ఇస్తుందని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు.
