🔥నంద్యాల సమావేశంలో బలిజ సంఘీయుల డిమాండ్🔥
నంద్యాల, ఫిబ్రవరి 28(నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ బలిజ( కాపు తెలగ ) మహాసభ ఆధ్వర్యంలో నంద్యాలలో జరిగిన సమావేశంలో గ్రేటర్ రాయలసీమ 12 జిల్లాలలో బలిజలకు రాజకీయ అవకాశాలు కల్పించాలని బలిజ సామాజిక వర్గం నాయకులు ముక్త కంఠంతో డిమాండ్ చేశారు.సమావేశంలో చిత్తూరు మాజీ ఎమ్మెల్యే A.S మనోహర్, తిరుపతి మాజీ ఎమ్మెల్యే మోహన్, నంద్యాల బలిజ సంఘీయుల కళ్యాణ మండపం అధ్యక్షులు వర్ధంశెట్టి రాజారాం, శాంతిరామ్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ M.శాంతి రాముడు, బిజెపి సీనియర్ నాయకులు డాక్టర్.ఇంటి ఆదినారాయణ, బలిజ మహాసభ స్టీరింగ్ కమిటీ సభ్యులు న్యాయవాది చెన్ను.శివప్రసాద్ రావు , అహోబిలం శ్రీకృష్ణదేవరాయ బలిజ అన్నదాన సత్రం అధ్యక్షులు శెట్టి విజయకుమార్, జనసేన నాయకులు మైలేరి మల్లయ్య -ఆళ్లగడ్డ, డాక్టర్ గుర్రంకొండ ప్రభాకర్, నల్లగట్ల బాలుడు, కర్నూల్ బలిజ సంఘంనాయకులు ఆర్జా రామకృష్ణ,కోనేటి చంద్రబాబు, M.రవికుమార్, టీడీపీ సీనియర్ నాయకులు పసుపులేటి హరి ప్రసాద్ – కడప ,కృష్ణతేజ – పులివెందుల, కడియాల వరదరాజులు నాయుడు – చిత్తూరు, రమణ, పుల్లయ్య, రమేష్, యగటీల రంగనాధ్ తదితర బలిజ నాయకులు హాజరయ్యారు.
ప్రజాస్వామ్య వ్యవస్థలో ఆయా వర్గాలకు జనాభా నిష్పత్తి మేరకు అధికార, రాజకీయ రంగంలో భాగస్వామ్యం కలిగినప్పుడే ప్రజాస్వామ్యం ముందుకు వెళుతుందని భారత రాజ్యాంగం పేర్కొన్న విషయాన్ని బలిజ నాయకులు గుర్తు చేశారు.గ్రేటర్ రాయలసీమ జిల్లాలలో 70 శాసనసభ స్థానాలు ఉండగా కేవలం ఇద్దరు ఎమ్మెల్యేలు మాత్రమే బలిజల నుంచి ఉండడం అన్యాయమన్నారు.12 జిల్లాల్లో మొత్తం 2 కోట్ల 70లక్షల జనాభాలో దాదాపు 50 లక్షల జనాభా కలిగిన బలిజలకు రాజ్యసభ, లోక్ సభ, MLC, Z.P. చైర్మన్, మునిసిపల్ చైర్మన్, మేయర్, ZPTC, MPTC, సర్పంచ్ తదితర అన్ని పదవుల్లో ప్రాతినిధ్యం ఇవ్వాలని కూటమి పార్టీలు టీడీపీ – జనసేన – బీజేపీ లకు బలిజ నాయకులు విజ్ఞప్తి చేశారు.
భారత రాజ్యాంగం సమానత, సామాజిక న్యాయ సూత్రాల ప్రకారం బలిజలకు రాజ్యాధికారంలో ప్రాతినిధ్యం కల్పించేందుకు తెలుగుదేశం, జనసేన, బిజెపి కూటమి ప్రభుత్వం ముందుకు రావాలని కోరారు.
12 జిల్లాల బలిజ సామాజిక వర్గం డిమాండ్లు :
1). జనాభా నిష్పత్తి మేరకు బలిజలకు రాజ్యసభ, ఎమ్మెల్సీ, ప్రభుత్వ నామినేటెడ్ పోస్టులలో అవకాశాలు కల్పించాలి.
2) రానున్న పంచాయతీ ఎన్నికలలో జడ్పీ చైర్మన్, జడ్పిటిసి, ఎంపీటీసీ,సర్పంచ్ స్థానాలు మరియు మున్సిపాలిటీలలో మేయర్, చైర్మన్, కార్పొరేటర్ల స్థానాలు జనాభా నిష్పత్తి మేరకు బలిజలకు కేటాయించాలి.
3) నిర్మాణంలో ఉన్న బలిజ / కాపు భవనాలను వెంటనే పూర్తి చేసి బలిజ సంఘీయులకు అప్పగించాలి.
4) కాపు కార్పొరేషన్ పేరును ” కాపు బలిజ తెలగ కార్పొరేషన్” గా మార్పు చేసి ఏడాదికి కనీసం రూ. 5 వేల కోట్లు కేటాయించి బలిజ కాపు తెలగ సంఘీయులకు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాలి.
5) గతంలో B.C రిజర్వేషన్ సర్టిఫికెట్స్ కలిగి వున్న బలిజలకు తిరిగి సర్టిఫికెట్స్ జారీ చేయాలి.
డిమాండ్స్ సాధనకు సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు, పార్టీల ముఖ్య నాయకులను కలిసి చర్చించాలని సమావేశంలో బలిజ నాయకులు తీర్మానం చేశారు.
