- రూ.2,300 కోట్ల పెట్టుబడితో బ్లూ జెట్ హెల్త్‌కేర్ పరిశ్రమ
- 1,750 మందికి ప్రత్యక్ష ఉద్యోగాలు
- రాంబిల్లి సెజ్‌లో 102.48 ఎకరాల కేటాయింపు
- నేడు మంత్రి లోకేష్ చేతుల మీదుగా శంకుస్థాపన
అనకాపల్లి, ఫిబ్రవరి 28(నేటి తెలుగు పత్రిక): ఉత్తరాంధ్ర పారిశ్రామిక అభివృద్ధికి మరో భారీ ప్రాజెక్ట్ జతకానుంది. అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలంలోని ఇండస్ట్రియల్ పార్క్‌లో ప్రముఖ ఫార్మా సంస్థ బ్లూ జెట్ హెల్త్‌కేర్ లిమిటెడ్ పరిశ్రమ ఏర్పాటుకు రాష్ట్ర విద్య, ఐటీ మంత్రి నారా లోకేష్ నేడు ఉదయం 10.30 గంటలకు శంకుస్థాపన చేయనున్నారు. మహారాష్ట్రలో ప్రధాన కార్యాలయం కలిగిన ఈ సంస్థ ప్రత్యేక ఔషధాలు, ఆరోగ్య సంరక్షణ పదార్థాల తయారీలో జాతీయస్థాయిలో గుర్తింపు పొందింది. రాంబిల్లి సెజ్‌లో ఫార్మాస్యూటికల్, ఇంటర్మీడియట్, కాంట్రాక్ట్ డెవలప్‌మెంట్ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయనుంది.
భారీ పెట్టుబడి – స్థానికులకు ఉపాధి
కూటమి ప్రభుత్వం రాంబిల్లి సెజ్‌లో రెండో విడత భూముల నుంచి 102.48 ఎకరాలు కేటాయించింది. ఎకరా రూ.40 లక్షల ధరకు కేటాయించడంతో పాటు అదనపు ప్రోత్సాహకాలు మంజూరు చేసింది.రూ.2,300 కోట్ల పెట్టుబడితో దశలవారీగా ప్రాజెక్ట్ అభివృద్ధి చేపట్టి, 2028-29 ఆర్థిక సంవత్సరానికి కార్యకలాపాలు ప్రారంభించనున్నారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా 1,750 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు లభించనున్నాయి.ఈ పెట్టుబడి ఉత్తరాంధ్రలో పారిశ్రామిక వాతావరణాన్ని బలోపేతం చేసి, అనుబంధ పరిశ్రమలకు ప్రోత్సాహం ఇచ్చే అవకాశముంది. రాష్ట్రాన్ని అధునాతన ఫార్మా తయారీ కేంద్రంగా తీర్చిదిద్దడంలో ఈ ప్రాజెక్ట్ కీలకంగా మారనుంది.
ఈ కార్యక్రమంలో జిల్లా ఇంఛార్జ్ మంత్రి కొల్లు రవీంద్ర, అనకాపల్లి బీజేపీ ఎంపీ సీఎం రమేష్, బీయలమంచిలి నియోజకవర్గ జనసేన ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్, ఏపీఐఐసీ ఛైర్మన్ మంతెన రామరాజు, ఏపీఆర్డీసీ ఛైర్మన్ పి.నాగేశ్వరరావు, బ్లూ జెట్ హెల్త్‌కేర్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఛైర్మన్ అక్షయ్ బన్సారీలాల్ అరోరా, మేనేజింగ్ డైరెక్టర్ శివెన్ అరోరా, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ వేణుబాబు, సహ వ్యవస్థాపకులు & ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నరేష్ షా, కలెక్టర్ విజయ కృష్ణన్, బ్లూ జెట్ హెల్త్‌కేర్ బృంద సభ్యులు, ప్రజా ప్రతినిధులు, ఏపీఐఐసీ, వివిధ శాఖల సీనియర్ అధికారులు పాల్గొన్నారు.




